సాక్షాత్ పార్టీ అధ్యక్షుడుకే పార్టీపై ఆసక్తి, దాని మనుగడపై అనుమానాలు ఉన్నప్పుడు ఇక ఆ పార్టీని రక్షించడం ఎవరి తరం? ఇది తెలంగాణాలో తెదేపాను ఉద్దేశ్యించి ఆ పార్టీ నేతలే అనుకొంటున్నా మాటలు. గ్రేటర్ ఎన్నికలు జరగడమే ఆలస్యం అన్నట్లు తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోయారు. మున్ముందు ఇంకా ఎంతమంది గోడ దూకేస్తారో తెలియదు కానీ చాలా మంది దూకేస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీని పట్టించుకోకపోయినా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం నిబ్బరం కోల్పోకుండా తెరాసతో ఒంటరి పోరాటం చేయడానికి సిద్దం అవుతుండటం మెచ్చుకోవలసిందే.
ఆయన ఇక నుండి నేరుగా ప్రజల మధ్యకే వెళ్లి స్థానిక సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దం అవుతున్నారు. ముందుగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో దత్తత తీసుకొన్న చిన్నముల్కనూరు గ్రామానికి స్వయంగా వెళ్లి అక్కడ జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రే స్వయంగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో దాని రూపు రేఖలు పూర్తిగా మారిపోయి ఆ గ్రామం దశ తిరుగబోతోందని అందరూ భావించారు. కానీ అంత సంతృప్తికరంగా అభివృద్ధి జరుగలేదనే సంగతి రేవంత్ రెడ్డి గ్రహించారు.
ఆ తరువాత ఆయన మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలబడి వారికి న్యాయం కల్పించడానికి ప్రభుత్వంతో పోరాటానికి సిద్దం అవుతున్నారు. స్థానిక పార్టీ క్యాడర్ ని వెంటబెట్టుకొని ప్రజలతో కలిసి పోరాటాలు చేయడం ద్వారా మళ్ళీ ప్రజల అభిమానం పొంది పార్టీని బలోపేతం చేసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరి ఆయనతో పార్టీ నేతలు కలిసి పనిచేయడానికి ముందుకు వస్తారా లేకపోతే తెరాస వశీకరణ మంత్రానికి లొంగిపోయి తెరాసలో చేరిపోతారో చూడాలి.