తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సివిల్ సర్వీస్ అధికారుల్లో తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కొంత మంది అధికారులే సుదీర్గ కాలంగా చక్రం తిప్పుతున్నారు. తెలంగాణకు చెందిన వారికి పెద్దగా అవకాశాలు దక్కడంలేదు. ఈ అసంతృప్తి సివిల్ సర్వీస్ అధికారుల్లో చాలా కాలం నంచి ఉంది. అడపాదడపా బయటపడుతున్నా వారికి ఉన్న పరిమితుల కారణంగా లోలోనే మథనపడుతున్నారు.ఇప్పుడీ అంశాన్ని రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చారు. తెలంగాణ సర్కార్‌లో చక్రం తిప్పుతున్న అధికారులంతా బీహార్‌కు చెందిన వారేనని.. తెలంగాణ ప్రాంతం నుంచి సివిల్ సర్వీస్ సాధించన వారికి ప్రతిభ లేదా అని కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు.
సీఎస్ సోమేష్ కుమార్, జయేష్ రంజన్ , అరంవింద్ కుమార్ , సందీప్ కుమార్ సుల్తానియా , రజత్ కుమార్ , జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ ఇలా అందరూ బీహార్ సివిల్ సర్వీస్ అధికారుల గుప్పటిలో అన్ని శాఖళు ఉన్నాయన్నారు. తాత్కాలిక డీజీపీగా ఉన్న అంజనీకుమార్ కూడా బీహార్ కుచెందిన ఐపీఎస్నేనని ప్రశ్నించారు.52 మంది ఐఏఎస్ లలో కేవలం బీహార్ ఐఏఎస్ లే ప్రతిభావంతులా అని ప్రశ్నించారు. సీఎస్ సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్ అయినా తెలంగాణలో సీఎస్ పోస్టు ఇచ్చారని…మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు గల్లంతు చేశారని.. అలాంటి సేవే చేసిన రజత్ కుమార్‌కు మెరుగైన పోస్టు ఇచ్చారన్నారు.
కేసీఆర్ కూడా తమ పూర్వీకులు బీహార్ నుంచి వలస వచ్చారని 2008లో ప్రకటించుకున్నారని మీ పూర్వికులు బీహార్ కావొచ్చు కానీ పరిపాలన మొత్తం బీహార్ బ్యాచ్ కే ఇస్తారా అని కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం మొత్తం బీహారీల చేతిలో బందీ చేశారని సోమేష్ నిర్వాకం వల్ల ధరణి పోర్టల్‌తో సమస్యలు వచ్చి హత్యలు చేసుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తితో లోలోపల రగిలిపోతున్న సివిల్ సర్వీస్ అధికారులను ప్రభుత్వంపై రెచ్చగొట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. వారి మనసులో ఇదే బలంగా పడితే ప్రభుత్వానికి ఇబ్బందికమేనని అనుకోవచ్చు.