రేవంత్ రెడ్డి తాము పార్టీ తరపున చేసిన ఓ సర్వేను రిలీజ్ చేశారు. గతంలో కాంగ్రెస్ కు డెభ్బై సీట్లు ఖాయమని చెబుతూ ఉండేవారు. కానీ సర్వేలో 45 సీట్లు మాత్రమే వేసుకున్నారు . బీఆర్ఎస్ కు కూడా నలభై ఐదు సీట్లు వస్తాయని చెబుతున్నారు. బీజేపీకి ఓడు సీట్లు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క చోట గెలిచి.. 111 చోట్ల డిపాజిట్ కోల్పోయిన బీజేపీకి ఏడు సీట్లు ఇవ్వడం అంటే గొప్ప విషయమే. కానీ.. తన పార్టీ గెలుస్తుందని ఎందుకు చెప్పలేదని .. కాంగ్రెస్ నేతలకూ డౌట్ వస్తోంది.
అయితే అసలు బీజేపీలో రేసులో లేదని.. ముఖాముఖి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు జరుగుతోందని చెప్పడానికే రేవంత్ రెడ్డి ఈ సర్వే రిలీజ్ చేశాడని అంటున్నారు. కాంగ్రెస్ లో ఇటీవల చేరికలు పెరుగుతున్నాయి. కొంత మంది డైలమాలో ఉన్నారు. ముఖ్యంగా బీజేపీలో ఉన్న కొంత మంది నేతలు మళ్లీ కాంగ్రెస్ లోకి రావాలని చూస్తున్నారు. కానీ వారికి రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కావడం లేదు. అందుకే వేచి చూస్తున్నారు. బీజేపీకి ఇక స్కోప్ లేదని.. చెప్పడానికే రేవంత్ ఈ సర్వే రిలీజ్ చేశాడని అంటున్నారు.
కేసీఆర్ తో హోరాహోరీ పోరు సాగుతోందని.. బీజేపీలో ఉన్న నేతలు బయటకు వచ్చి.. కాంగ్రెస్ తో జత కడితే.. కేసీఆర్ ను ఓడించవచ్చన్న సందేశాన్ని ఈ సర్వే ద్వారా రేవంత్ పంపారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏకపక్షంగా కాంగ్రెస్ గెలుస్తుందని ప్రకటించుకుంటే.. దానికి పెద్దగా విలువ ఉండదు. అందుకే ఓటు బ్యాంక్ కూడా బీజేపీకి పధ్నాలుగు శాతానికి మించి లేదని చెబుతున్నారు. ప్రస్తుతం రేవంత్ చేరికల కోసం భారీ మిషన్ చేపట్టారు. అందు కోసమే ఆయన అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారని బీజేపీ వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి.