సాధారణంగా, ప్రతిపక్షాల వాయిస్ కి మీడియాలో ప్రాధాన్యత దక్కాలి. ఓరకంగా మీడియా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. పాలనలోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ.. ప్రతిపక్షాలవారు చేస్తున్న ఆరోపణలతో ప్రభుత్వాలను నిలదియ్యాలి! కానీ, తెలంగాణలో ఈ సీన్ రివర్స్ అవుతోందని చెప్పక తప్పదు. అధికారంలో ఉన్నవారికి బాకాలు ఊదడమే లక్ష్యంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయి. అంతేకాదు, ఇదే సమయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం నేతలు ఈ వివక్షను బాగా ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ఆధారాలతో సహా సర్కారు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే.. మీడియాలో ప్రాధాన్యత దక్కడం లేదంటూ వారు వాపోతున్నారు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు ప్రతిబింబించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా కలకలం రేపుతున్న అంశం మియాపూర్ భూకుంభకోణం. ఇది వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచీ ప్రతిపక్షాలన్నీ తెరాసపై దుమ్మెత్తి పోస్తున్నాయి. అయితే, ఇది తాము వెలుగులోకి తెచ్చిన అవినీతి వ్యవహారమనీ, ప్రతిపక్షాలుగానీ మీడియాగానీ బయటకి తేలేదంటూ తమ సత్యసంధతను నిరూపించుకునేందుకు కేటీఆర్ వంటి నాయకులు సమర్థన ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇదే వ్యవహారంపై తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో ఉన్నారంటూ కొంతమంది ప్రముఖ పేర్లనూ, వారి కారు నంబర్లనూ, ఇతర వివరాలను వెల్లడించారు. కావాలనుకుంటే తన దగ్గర సీసీ టీవీ ఫుటేజ్ కూడా ఉందనీ, దాన్ని కూడా బహిర్గతం చేస్తానని కూడా రేవంత్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులపై కూడా రేవంత్ కొన్ని ఆరోపణలు చేశారు. మొత్తం వ్యవహారానికి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయనీ, బయటపెడతానని అన్నారు.
నిజానికి, రేవంత్ వెల్లడించిన వివరాలపైగానీ, చేసిన తీవ్ర ఆరోపణలపై మీడియాలో ప్రాధాన్యత దక్కలేదు. ప్రభుత్వానికి ఇబ్బందికరం అనిపించిన వ్యాఖ్యల్ని ఎడిట్ చేసి… తూతూ మంత్రంగా పసలేని వ్యాఖ్యల్ని మాత్రమే కొన్ని ప్రసార మాధ్యమాలు ప్రచురణ చేశాయని టీడీపీ నేతలు వాపోతున్నారు. రేవంత్ బయటపెట్టిన కారు నంబర్ల గురించిగానీ, ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న కొంతమంది వివరాల గురించిగానీ మీడియా పట్టించుకోలేదనీ, ప్రభుత్వం ఆడమన్నట్టుగానే మీడియా ఆడుతోందని టీటీడీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ మధ్య రేవంత్ రెడ్డికి మీడియాలో ప్రాధాన్యత బాగా తగ్గించేశారనీ, ఇతర అంశాలపై రేవంత్ మాట్లాడుతున్నా కూడా సింగిల్ కాలమ్ కి పరిమితం చేస్తున్నారంటూ టీడీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. సో.. రేవంత్ పై మీడియా అప్రకటిత నిషేధం విధించిందేమో అనిపిస్తోంది.