వరద సహాయక చర్యల్లో తెలంగాణ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం వద్ద లక్ష కోట్లు ఉన్నాయని..సీఎం సహాయ నిధికి 2 వేల కోట్లు ఇవ్వొచ్చు కదా అంటూ సెటైర్లు వేశారు.
మహబూబాబాద్ జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోయిన యువ శాస్త్రవేత్త కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించిన రేవంత్..ప్రభుత్వం అలర్ట్ గా ఉండటం వల్లే పెద్ద నష్టం తప్పిందన్నారు. అయినా , బీఆర్ఎస్ నేతలు చిల్లర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాలో ఉండి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే అందరి లెక్కలు బయటకు తీస్తామన్న రేవంత్..ఖమ్మంలో పువ్వాడ అజయ్ అక్రమాల బాగోతం తేలుద్దాం.. హరీష్ రావును రమ్మనండి.. నిజనిర్ధారణ కమిటీ ద్వారా వాస్తవాలను నిగ్గు తెలుద్దామని సవాల్ విసిరారు.