తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతోన్న సందర్బంగా జూన్ 2 న పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే అధికారిక కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. ఇందుకోసం కేసీఆర్ కు స్పెషల్ ఇన్విటేషన్ ను పంపారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోన్న దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని రేవంత్ కోరారు. దీంతో శనివారం నిర్వహించబోయే కార్యక్రమానికి కేసీఆర్ హాజరు అవుతారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
అయితే, కాంగ్రెస్ సర్కార్ నిర్వహిస్తోన్న ఈ అధికారిక కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొనకపోవచ్చునని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలకు కౌంటర్ బీఆర్ఎస్ కూడా మూడు రోజులపాటు వేడుకలు నిర్వహిస్తోంది. జూన్ రెండున దశాబ్ది వేడుకల ముగింపును సభను తెలంగాణ భవన్ లో నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ఈ సభ కేసీఆర్ అధ్యక్షతన జరగనుండటంతో ప్రభుత్వం నిర్వహించబోయే కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
పైగా.. రేవంత్ రెడ్డి పేరునే ప్రస్తావించేందుకు ఆసక్తి చూపని కేసీఆర్… ఆయనతో కలిసి వేదిక పంచుకునే అవకాశం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోతే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తోంది అన్నది చూడాలి..