తెలుగుదేశం పార్టీకి రేవంత్ రెడ్డి గుడ్ బై చెప్పేయడం దాదాపు ఫిక్స్ అయినట్టుగానే వాతావరణం కనిపిస్తోంది. వీలైనంత త్వరగా ఈ అంశంపై ఓ స్పష్టత ఇచ్చేయాలన్న ఆతృత రేవంత్ రెడ్డిలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతోపాటు నేతలు హాజరైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి కాస్త ఆలస్యంగా వచ్చారు. అసెంబ్లీ ఉండటంతో కొంచెం లేటైయింది. సమావేశ మందిరంలో ఎక్కడో చివర్న కూర్చుందామని రేవంత్ ప్రయత్నిస్తే.. తన పక్కనే కుర్చీ వేసి మరీ చంద్రబాబు ఆయన్ని కూర్చోబెట్టుకున్నారు. ఈ సమావేశం తరువాత రేవంత్ పంచాయితీ అమరావతికి మారిన సంగతి కూడా తెలిసిందే. అయితే, తాను 2వ తేదీన మళ్లీ హైదరాబాద్ వస్తాననీ, అప్పుడు దీనిపై విస్తృతంగా చర్చించుకుందామని చంద్రబాబు అన్నారు. ఇక్కడే రేవంత్ జోక్యం చేసుకుని… ‘అప్పటివరకూ వద్దు సార్, కంటిన్యుటీ ఉంటుంది రేపే చర్చించుకుందాం’ అనే ప్రతిపాదన రేవంత్ తీసుకొచ్చారు. దాంతో రేపే అమరావతికి రండీ అంటూ చంద్రబాబు చెప్పారు. అది కూడా కొంతమంది టీడీపీ నేతలకు మాత్రమే చంద్రబాబుతో వ్యక్తిగత భేటీకి అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్పారు.
తాజా పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి మనసులో మాట ఏంటంటే.. తెలుగుదేశం పార్టీకి దూరమైనా, చంద్రబాబుతో సత్సంబంధాలు ఉండేలా చూసుకోవాలనే ధోరణిలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆయనతో మంచి రిలేషన్ కొనసాగించాలనేదే రేవంత్ వ్యూహంగా ఉందని అంటున్నారు! పార్టీ నేతలంతా తనను దూరం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నా, చంద్రబాబుపై ఉన్న గౌరవంతో, ఆయనకు తలవంపులు తెచ్చేలా వ్యవహరించకూడదనే ఆలోచనతోనే తాను సంయమనం పాటిస్తున్నానంటూ రేవంత్ సన్నిహితుల దగ్గర చెప్పినట్టు సమాచారం. పార్టీ నుంచి బయటకి వచ్చాక ఆయన ఓ భారీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సమావేశంలో ‘చంద్రబాబు గుట్టు బయటపెడతా, టీడీపీ నేతల అసలు రంగు చూపిస్తా’ అంటూ రేవంత్ ఆవేశానికి వెళ్లే అవకాశం లేదనీ అంటున్నారు. తన ఏకైక లక్ష్యం కేసీఆర్ పోరాటమనీ, ఆయనతో పోరు సాగించాలంటే కావాల్సిన శక్తిని సమకూర్చుకునే పరిస్థితి టీడీపీలో లేదు కాబట్టి, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు వెళ్తున్నానని మాత్రమే చెప్పి హుందాగా పార్టీ నుంచి బయటకి వచ్చే ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.
చంద్రబాబుతో భవిష్యత్తులో సత్సంబంధాలు కొనసాగించాలనే ప్రయత్నం రేవంత్ వైపు స్పష్టంగానే ఉందనేది ఈ ఎపిసోడ్ ప్రారంభం నుంచి ఆయన తీరు గమనిస్తే స్పష్టంగానే అర్థమౌతుంది. ఆ అవసరం కూడా రేవంత్ కి ఉంది కదా. ఇక, రేవంత్ విషయంలో చంద్రబాబు కూడా ఆవేశానికి లోనుకాలేదు. విదేశాల నుంచి వచ్చిన వెంటనే వేటు వేసేయాలని పార్టీ నేతలు ఆవేశపడినా… వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, రేవంత్ ను తన పక్కన కూర్చోబెట్టుకోవడం ద్వారా చంద్రబాబు పాటించాల్సిన సంయమనాన్ని పాటించారనే చెప్పాలి. ఏదేమైనా… తెరాసపై పోరులో భాగంగానే టీడీపీకి దూరమౌతున్నాననీ, చంద్రబాబుపై ఆగ్రహంతోగానీ, ఆయన తీరుపై అసంతృప్తితోగానీ, వ్యవహార శైలికి విసిగిపోయిగానీ తాను దూరం కావడం లేదనే ధోరణిలోనే రేవంత్ వీడ్కోలు చెప్పేందుకు ప్రిపేర్ అవుతున్నారనే తెలుస్తోంది.