పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షాలకు ఇస్తారని, రేవంత్ సర్కార్ మాత్రం సంప్రదాయానికి విరుద్దంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి ఇచ్చారని బీఆర్ఎస్ ఒకటే గగ్గోలు పెడుతోంది. పీఏసీ చైర్మన్ పదవికి హరీష్ రావు నామినేషన్ వేశాక కూడా.. అరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా ఎలా నియమిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కాంగ్రెస్ ను ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్ వాదనకు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చామన్నారు. అంటే ఇంకా అరికపూడి గాంధీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గుర్తిస్తున్నామని చెప్పకనే చెప్పారు. అదే సమయంలో బీఆర్ఎస్ చేస్తోన్న ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ చివరి రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38 మంది అని ప్రకటించినప్పుడు .. ఆ పార్టీ నేతలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగా ఎలా గుర్తిస్తారని అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని రేవంత్ నిలదీశారు . ఇక.. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.బతకడానికి వచ్చినోళ్ళ ఓట్లు కావాలి కానీ, వాళ్లకు సీట్లు ఇవ్వొద్దా ? కౌశిక్ రెడ్డి అలా మాట్లాడటం సరైంది కాదని రేవంత్ హితవు పలికారు.