హైడ్రా పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నా విపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. రైతురుణమాఫీ విషయంలో అసలు వాస్తవాలను పక్కదోవ పట్టించేందుకు హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నాయి. విపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు తీసుకొచ్చిందే ఈ హైడ్రా అంటూ వస్తోన్న విమర్శలకు సీఎం రేవంత్ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉంటే సొంత పార్టీ నేతల భవనాలను కూడా వదలబోమని స్వయంగా రేవంత్ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ , మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు సోదరుడు ఆనంద్ భవనాలను కూల్చడంతో హైడ్రా నెక్స్ట్ ఏ కాంగ్రెస్ నేత అక్రమ కట్టడాలను నేలమట్టం చేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవని, ఇందుకు మానసికంగా సిద్దంగా ఉండాలని రేవంత్ తేల్చిచెప్పినట్లుగా తెలుస్తోంది. హైడ్రా ద్వారా ఓ గొప్ప బాధ్యతను తీసుకున్నామని, ఈ విషయంలో తన, మన అనే వాటికి తావిస్తే హైడ్రాకు విలువ లేకుండా పోతుందని, ఫలితంగా ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతుందని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.