తెలంగాణ సీఎంవోను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారా..? ఫైల్స్ క్లియరెన్స్ లో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు అందటంతో సమర్ధవంతమైన అధికారులను నియమించాలని ఫిక్స్ అయ్యారా..? ఎన్నికల కోడ్ ముగియగానే సీఎంవోలో మార్పులు తప్పవా..? అంటే అవుననే తెలుస్తోంది.
సీఎంవోలో పని చేసే అధికారులు వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రికి చేదోడు, వాదోడుగా ఉండాలి. కానీ కొంతమంది అధికారుల వ్యవహారశైలి అందుకు విరుద్దంగా ఉంది. కీలకమైన ఫైల్స్ పై సంతకం చేయకుండా కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వీటిపై మంత్రులు సీఎం రేవంత్ కు కూడా కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎంవోలో మార్పులు, చేర్పులు చేయాలని రేవంత్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఎవరెవరు అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు..? ఎందుకు అలా ఉదాసీనంగా ఉంటున్నారు..? ప్రభుత్వంపై విమర్శలు వచ్చేందుకే ఇలా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా..? అని చర్చించి ఓ నిర్ధారణకు వచ్చాక వారిని తప్పించే అవకాశం ఉంది.
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పెద్దఎత్తున ఐఏఎస్ అధికారులను మార్చాలని రేవంత్ భావిస్తున్నారు. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వారిని గుర్తించి వారి స్థానంలో సమర్ధవంతమైన అధికారులను నియమించాలని ఫిక్స్ అయ్యారు. కీలకమైన హోదాలో ఉన్న అధికారులను తప్పిస్తే వారి స్థానంలో ఎవరిని నియమించాలనే విషయంపై కూడా రేవంత్ త్వరలోనే చర్చించనున్నట్లు తెలుస్తోంది. పనితీరు సరిగా లేని అధికారులను పక్కనపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. లేదంటే వారి శాఖలను మార్చే అవకాశమో ఉందన్న ప్రచారం జరుగుతోంది.