పదేళ్ల బీఆర్ఎస్ పాలన ప్రజలకు దూరంగా జరిగిందని .. ప్రభుత్వం అందుబాటులో లేకపోవడంతకో పెద్ద ఎత్తున సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అందుకే ప్రత్యేకంగా ప్రజా పాలన అనే కార్యక్రమం చేపట్టి.. ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకూ ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో కార్యక్రమం గురించి కలెక్టర్లకు వివరించారు.
ప్రజాపాలనలో భాగంగా అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కార్యక్రమం చేపజతారు. కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం, గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోనుంది. వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా కసరత్తు చేస్తుంది. గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ‘ప్రజా పాలన’ సాగనుంది. అధికారులు నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారు. తొలుత పది రోజుల గ్రామస్థాయిలో నిర్వహించిన అనంతరం, అవసరమైతే మరోసారి నిర్వహణపై ఆలోచన చేసే అవకాశం ఉంది.
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే ‘ప్రజా వాణి’ పేరిట ప్రజా భవన్ లో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తుండగా, వాటిల్లో ఎక్కువగా భూ సమస్యలు, రెవెన్యూ, డబుల్ బెడ్ రూం ఇండ్లు, పింఛన్లు వంటి అంశాలపైనే ఫిర్యాదులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు ప్రయాణ భారం, టైం వేస్ట్ కాకుండా చిన్న చిన్న సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరిస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే నేరుగా అధికారులే గ్రామాలకు వెళ్లి సమస్యలు పరిష్కరించేలా ‘ప్రజా పాలన’కు శ్రీకారం చుట్టింది.