తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు స్పష్టమైన తేడాను ప్రజలు చూస్తున్నారు. కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకూ అందరి అభిప్రాయం ఇదే. దీనికి కారణం ప్రజలకు ప్రభుత్వం వద్ద యాక్సెస్ లభించడమే. గతంలో ప్రభుత్వానికి చెప్పుకునేందుకు ప్రజలకు అవకాశం లేదు. ఉన్న ఒకే ఒక్క అవకాశం ట్విట్టర్. సీఎంను కలిసే అవకాశం అసలు ఉండేది కాదు. ఈ లోపాలను గుర్తించిన రేవంత్ రెడ్డి ప్రజల మనసుల్ని ఆకట్టుకునే మార్గాన్ని కనిపెట్టారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ ను నిర్వహించారు. ప్రగతి భవన్ ను ప్రజాభవన్‌గా పేరు మార్చి.. ప్రజలకు యాక్సెస్ ఇచ్చారు. అక్కడికే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ప్రజల గోడు విన్నారు. అది ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. తమ గోడు వినే ముఖ్యమంత్రి వచ్చారన్న మాట వినిపించింది. సామాన్యుల్లోనే కాదు.. ప్రజాప్రతినిధుల్లోనూ అదే భావన. శాసనమండలిలో ఎమ్మెల్సీ నర్సారెడ్డి చేసిన కామెంట్లే.. కేసీఆర్ ఎక్కడ తప్పు చేశారో.. రేవంత్ రెడ్డి అక్కడే దిద్దుతున్నారని అర్థం అయ్యేలా చేస్తుంది.
ముఖ్యమంత్రి అసలు ప్రజల్ని కవాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ ఎన్నికల ప్రచార సమయంలో వాదించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అన్ని వ్యవస్థలు పని చేస్తున్నాయని సీఎం దగ్గరకు రావాల్సిన పని లేదనేది కేటీఆర్ అభిప్రాయం. ఆ వ్యవస్థలు విఫలమైతేనే సీఎం దగ్గరకు వస్తారు. ఆ లాజిక్ కేటీఆర్ మర్చిపోయి.. తాను తెలివిగా సమాధానం చెప్పాననుకున్నారు.
కానీ అది ఎంత తప్పో.. ఇప్పుడు ప్రజా వాణి కార్యక్రమానికి తరలి వస్తున్న ప్రజల సంఖ్య నిరూపిస్తోంది.
ఒక్క ప్రజలకే కాదు.. బీఆర్ఎస్ సర్కార్ లో అతి పెద్ద లోపం ప్రజాప్రతినిధులకూ సీఎం అందుబాటులో ఉండకపోవడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ లోపాన్ని తన పనితీరు ద్వారా చక్కదిద్దుతున్నారు. గత పదేళ్లుగా ఏం కోల్పోయారో.. అది మళ్లీ కల్పిస్తున్నామని ఆశలు రేపుతున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లో నాలుగు సార్లు ఆయనను కలిశాను..కానీ సీఎం గా ఉన్నప్పుడు 30 సార్లు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ కేసీఆర్ ను అసలు ఎప్పుడూ కలవలేకపోయాను అని.. శాసనమండలిలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నర్సారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి మనసుల్లో ఉండేవి. రేవంత్ అడిగిన వారంద్రనీ కలుస్తూ.. ఆ లోపాన్నీ తీర్చేస్తున్నారు. తమకు కావాల్సినట్లుగా పరిపాలించడం కాదు.. ప్రజల అవసరాల్ని గుర్తించి పరిపాలన చేయడం కూడా ముఖ్యం. రేవంత్ రెడ్డి తన పరిపాలనలో ఆ ప్రత్యేకత చూపిస్తున్నారు.