తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏడో తేదీన రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని తనకేం తక్కువని పట్టుబట్టిన మల్లు భట్టవిక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి.. రేవంత్ రెడ్డికే సీఎం పదవి ఇస్తున్నట్లుగా తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల సమావేశంలో వీరు కాస్త హడావుడి చేయడంతో సోమవారం ప్రమాణస్వీకారం ఆగింది. వీరిద్దర్ని ఢిల్లీ పెద్దలు పిలిపించారు.
ఉదయం కేసీ వేణుగోపాల్ ఇంట్లో వీరితో రాహుల్ మాట్లాడారు. రేవంత్ రె్డికే యాభై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున సీఎల్పీ నేతగా ఖరారు చేశామని స్పష్టం చేశారు. అయితే రొటేషన్ సీఎం అయినా ఇవ్వాలని ఉత్తమ్, భట్టి పట్టుబట్టినట్లుగా చెబుతున్నారు. అలాంటి అవకాశమే లేదని.. రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. అయితే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రావాలని పిలిచారు. రేవంత్ ఢిల్లీకి రాక ముందే.. ప్రెస్ మీట్ పెట్టిన వేణుగోపాల్ .. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారని ప ్రకటించారు.
ఏడో తేదీన ప్రమాణం చేస్తారని తెలిపారు. కేసీ వేణుగోపాల్ ఈ ప్రకటన చేస్తున్న సమయంలో ఉత్తమ్ రెడ్డి, భట్టి విక్రమార్క్ కూడా ప్రెస్ మీట్ లో ఉన్నారు. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుందని .. కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మల్లు భట్టి విక్రమార్కకు.. డిప్యూటీ సీఎం ఇస్తారని చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమి ఇస్తారో స్పష్టత లేదు. కానీ కాంగ్రెస్ లో సీఎం పంచాయతీ ముగిసినట్లు అయింది. ఏడో తేదీ నుంచి అధికారికంగా … తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరనుంది.