హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడు, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఈ సాయంత్రం చర్లపల్లి జైలునుంచి విడుదలయ్యారు. బయటకొచ్చిన రేవంత్‌కు తెలుగుదేశం కార్యకర్తలు, అతని అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణనుంచేకాక ఆంధ్రప్రదేశ్నుంచికూడా తెలుగుదేశం కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చారు. భారీ ఊరేగింపుతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు బయలుదేరిన ర్యాలీ మధ్యలో – రేవంత్ అక్కడక్కడా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ తనపై కుట్రపన్ని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్నంతా ఈ కేసుకోసం ఉపయోగించారని అన్నారు. తెలుగుదేశాన్ని లేకుండా చేస్తానన్న వ్యక్తికి పావురాలగుట్టలో ఎలాంటి గతి పట్టిందో కేసీఆర్‌కూ అదే గతి పడుతుందంటూ అన్యాపదేశంగా వైఎస్‌ను ఉటంకించారు. కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, హరీష్‌రావును, తలసాని శ్రీనివాస యాదవ్‌ను సన్నాసి, బద్మాష్వంటి తీవ్ర పదజాలంతో విమర్శించారు. కేసీఆర్ కుటంబంనుంచి తెలంగాణకు విముక్తి కల్పించటమే తన ఏకైక లక్ష్యమని చెప్పారు.
రేవంత్‌కు నిన్ననే హైకోర్ట్ బెయిల్ ఇచ్చినప్పటికీ, సాంకేతిక సమస్యల కారణంగా నిన్న విడుదల వీలుకాలేదు. ఇవాళ మధ్యాహ్నానికే బెయిల్ వారెంట్ రేవంత్ న్యాయవాదులకు అందింది. సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో రేవంత్ బయటకొచ్చారు.