తెలంగాణ అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు గురించి ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. శాసన సభలో అధికార , ప్రతిపక్షాల మధ్య కరెంట్ వార్ జరుగుతోన్న క్రమంలోనే రేవంత్ రెడ్డి చంద్రబాబుతో సాన్నిహిత్యాన్ని చెప్పుకొచ్చారు. నాడు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు జరిగిన విద్యుత్ కేటాయింపులపై చంద్రబాబును కోర్టుకు వెళ్ళకుండా ఆపినట్లు గుర్తు చేసిన రేవంత్..రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడింది తామేనని చెప్పుకొచ్చారు.
గురువులకు పంగనామం పెట్టే సంస్కృతి మీది… తిన్నింటి వాసాలను లెక్కపెట్టే లక్షణం మీది అంటూ బీఆర్ఎస్ నేతలపై రేవంత్ విరుచుకుపడ్డారు. తనకు చంద్రబాబును పదేపదే గురువుగా అభివర్ణిస్తుండటంపై స్పందిస్తూ… మిత్రులను మిత్రులుగా, సహచరులను సహచరులుగా భావిస్తామని.. అంతేకాని, తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మనస్తత్వం తనది కాదని రేవంత్ చెప్పుకొచ్చారు.
Also Read : పెద్దిరెడ్డి మౌనం.. సంగతేంటి..?
ఎవరి నుంచి ఏ మంచి జరిగినా తెలంగాణ గుర్తుంచుకుంటుందని కానీ, కేసీఆర్ మాత్రం అందుకు విరుద్దమని విమర్శించారు. గురువులను సైతం స్వార్ధం కోసం విమర్శించే డీఎన్ఏ బీఆర్ఎస్ కే అలవాటు అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై పవర్ కమిషన్ కు కొత్త చైర్మన్ ను నియమించి విచారణ జరిపిస్తామని రేవంత్ స్పష్టం చేశారు.