ఎన్నికల ప్రచారంలో.. మోడీని టార్గెట్ చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ తర్వాత రెవిన్యూ ఉద్యోగులపైనే గురి పెడుతున్నారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన సభలో కేసీఆర్ రెవెన్యూశాఖపై కీలక మైన వ్యాఖ్యలు చేశారు. జూన్, జూలై నెలలో కొత్త రెవెన్యు చట్టం చేస్తామని ప్రకటించారు. ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా చేస్తామన్నారు. దీంతో రెవిన్యూ ఉద్యోగుల్లో ఆందోళన ప్రారంభమయింది. రెవెన్యూ శాఖను ముక్కలు చేసి ఇతర శాఖల్లో కలుపుతారా లేక పూర్తిగా రద్దు చేస్తారా.. అన్న టెన్షన్ వారిలో ప్రారంభమయింది. విధుల్లో కోత విధించి ప్రైవేటుకు అప్పగించే ఆలోచన చేస్తున్నారన్న అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. భూ సర్వే, వివరాల సేకరణ, క్షేత్ర స్థాయి పరిశీలన రిపోర్టు ఇచ్చే బాధ్యత థర్డ్ పార్టీకి ఇవ్వాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త యాప్ లు రూపొందించి, సెల్ ఫోన్ సహాయంతో ప్రజలకు అనుసంధానం అయితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనపై కూడా చర్చించారని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో.. ప్రభుత్వంపై.. ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి ఈ భూసమస్యలే కారణమన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించారు. ఉద్యోగుల అవినీతి కారణంగా… రికార్డులు ట్యాంపరింగ్ చేస్తున్నారని.. ఏ చిన్న పని చేయాలన్నా… డబ్బులు ముట్టచెప్పాల్సిన పని వస్తోందన్న ఫిర్యాదులు అధిక సంఖ్యలో వస్తున్నాయి. నిజానికి ఇది.. ఇప్పటిదికాదు. రెవిన్యూ శాఖ అంటే.. ఉద్యోగులకు భారీగా అదనపు ఆదాయం తెచ్చే శాఖ లాంటిది. ఒక్క తెలంగాణలోనే కాదు… ఎక్కడైనా అంతే. ఇప్పుడు కేసీఆర్..ఈ శాఖను ప్రక్షాళన చేయడానికి నడుం బిగించారు. మరి… ఈ విషయంలో ఉద్యోగులు సైలెంట్‌గా ఉండే అవకాశం లేదు.
ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏం చేస్తారన్నదానిపై… ఉద్యోగులు.. తమ కార్యాచరణ ఖరారు చేసుకునే అవకాశం ఉంది. రెవిన్యూ ఉద్యోగులు సమ్మె చేస్తారు… ప్రజలు తనకు మద్దతుగా ఉండాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే.. తీవ్రమైన నిర్ణయం తీసుకోబోతున్నారనడానికి సూచనలని రెవిన్యూ ఉద్యోగులు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ప్రతిఘటనకు రెడీ అవుతున్నారు.