కర్ణాటక లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు జాతీయ నేతలందరూ హాజరయ్యారు. మోదీ ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలన్నీ కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి తరలి వచ్చాయి. పది నెలలు గడిచాయి. లోక్ సభ ఎన్నికలొచ్చాయి. కాంగ్రెస్, జేడీఎస్ పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తున్నాయి.
ఓట్ల బదిలీ జరిగితే కాంగ్రెస్, జేడీఎస్ స్వీప్ చేసినట్లే..!
ఓట్ల గణితం చూస్తే కాంగ్రెస్, జేడీఎస్ చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి 40.8 శాతం ఓట్లు వచ్చాయి. జేడీఎస్ కు 11 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీ కి 43 శాతం ఓట్లు దక్కాయి. కాంగ్రెస్, జేడీఎస్ ఓట్లు కలిపితే 50 శాతం దాటిపోతున్నాయి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు ఇప్పటివరకూ అయన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ నాయకుడు యడ్యూరప్ప చేయని ప్రయత్నం అంటూ లేదు. దాన్ని కాంగ్రెస్, జేడీఎస్ కలిసే ఎదుర్కుంటూ వస్తున్నాయి. అందుకే వాళ్ళిద్దరి మధ్య పొత్తు ఇప్పటికీ నిలిచి ఉంది. కానీ అంతర్గతంగా రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు మాత్రం సద్దుమణగడం లేదు .
దక్షిణ కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పొత్తుకు చిక్కులు..!
కాంగ్రెస్, జేడీఎస్ మధ్య గొడవంతా దక్షిణ కర్ణాటకలోనే అధికంగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఇక్కడ దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్నాయి. తాజాగా సినీ నటి సుమలత కూడా మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. పాత మైసూరు ప్రాంతానికి చెందిన మాండ్యా లోక్ సభ నియోజకవర్గం నుంచి కుమారస్వామి తన కొడుకు నిఖిల్ ను బరిలోకి దింపారు. ఇదే పాత మైసూరు ప్రాంతం నుంచి దేవెగౌడ కుటుంబం లో ముగ్గురు పోటీలో చేస్తున్నారు. దేవెగౌడ, అయన మనుమలు నిఖిల్, రేవణ్ణ ఇదే ప్రాంతం నుంచి లోక్ సభ బరిలో దిగారు. రేవణ్ణ పై కాంగ్రెస్ మాజీ మంత్రి ఒకరు బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఇక్కడే దశాబ్దాలుగా కాంగ్రెస్, జేడీఎస్ ప్రత్యర్ధులు కావడం తో వీరి మధ్య పొత్తుకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తమ కుటుంబానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నట్లు ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు..
కాంగ్రెస్, జేడీఎస్ గొడవల్ని బీజేపీ సొమ్ము చేసుకుంటుందా..?
కాంగ్రెస్, జేడీఎస్ మధ్య తగవులు ఎన్ని ఉన్నా… ఓట్ల గణితం మాత్రం వాళ్ళకే అనుకూలంగా ఉంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ విడివిడిగా పోటీ చేశాయి. ఆ రెండు పార్టీలకూ అసెంబ్లీ సెగ్మెంట్ల లో వచ్చిన ఓట్లు లెక్కగడితే 11 లోక్ సభ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. జేడీఎస్ కు నాలుగు లోక్ సభ స్థానాల్లో మెజారిటీ వచ్చింది. బీజేపీ కి ఏకంగా 13 సీట్ల లో మెజారిటీ వచ్చింది. అదే కాంగ్రెస్, జేడీఎస్ కలిసి పోటీ చేసినట్లయితే కర్ణాటక లో ఉన్న మొత్తం 28 లోక్ సభ సీట్లలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి 21 సీట్లు గెలుచుకోవచ్చు. నిజానికి కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు బలంగా ఉంటె కర్ణాటక లో బీజేపీ కి గడ్డు పరిస్థితులు తప్పవు. దక్షిణ కర్ణాటకలో బీజేపీ ఉనికి నామమాత్రం .