ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి పెట్టని కోటలాంటి నియోజకవర్గం పీలేరు. వాయల్పాడుగా ఉన్న నియోజకవర్గాన్ని 2009లో పీలేరులో కొన్ని భాగాలు కలిపి కొత్త నియోజకవర్గంగా మార్చారు. నల్లారి అమరనాథరెడ్డి ఇక్కడి ప్రజల మన్ననలు పొందారు. ఆయన హఠాన్మరణంతో.. ఆయన కుమారుడు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సీఎం అయ్యే వరకూ సోదరులు తెర వెనుకే ఉన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ “జై సమైక్యాంధ్ర పార్టీ” పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసి పోటీ చేశారు. కానీ.. సొంత నియోజకవర్గం పీలేరులోనూ విజయం సాధించలేకపోయారు. అయితే.. వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత కిరణ్ కాంగ్రెస్‌లో చేరగా.. ఆయన సోదరుడు కిషోర్ మాత్రం టీడీపీలో చేరారు. కిరణ్ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
పీలేరు నియోజకవర్గంలో పీలేరు, కలికిరి, కలకడ, కేవీపల్లె, గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాలు, 293 పోలింగ్ కేంద్రాలున్నాయి. మొత్తం ఓటర్లు 2,23,586 మంది ఉండగా వారిలో పురుషులు 1,11,055 మంది, మహిళలు 1,12.528 మంది, ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. నల్లారి కుటుంబంపై ప్రజల్లో అభిమానం ఉంది. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు.. నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ఇప్పుడు టీడీపీ బలం కూడా తోడవడంతో.. కిషోర్ కుమార్ రెడ్డి కంచుకోటను నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారు. చాలా ముందుగానే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన చంద్రబాబు.. అన్ని రకాల సహకారం అందించారు. కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రచారాస్త్రాలుగా చేసుకుంటున్నారు. టీడీపీలో చేరిన తరువాత పెద్దఎత్తున మంజూరు చేయించిన సీఎం రిలీఫ్ ఫండ్ సహాయాలు, పెద్దఎత్తున నిర్మించిన ఎన్టీఆర్ గృహాలు పంపిణీ చేశారు. ఏడాదిన్నరగా కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గాన్ని పలుమార్లు చుట్టి పార్టీ శ్రేణులు, సాధారణ ప్రజలతో మమేకం అయ్యారు.
వైసీపీ అభ్యర్థి పేరుకు… చింతల రామచంద్రారెడ్డే కానీ.. ఆయనకు… కర్త, కర్మ, క్రియ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. నల్లారి కుటుంబంతో అనాదిగా తమకున్న రాజకీయ వైరం కారణంగా పెద్దిరెడ్డి కుటుంబం చింతలను అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. ఆర్థిక వనరులు సహా.. ఎలక్షనీరింగ్ కూడా పీలేరులో పెద్దిరెడ్డే చూసుకుంటారు. ఈ సారి ఆయన పుంగనూరు, రాజంపేట పార్లమెంట్ పై ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావడంతో… పీలేరు విషయంలో చింతల రామచంద్రారెడ్డి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేగా… ఏ పనీ చేయించలేకపోయారు. అన్నీ టీడీపీ ఇన్చార్జ్ హోదాలో కిషోర్ కుమార్ రెడ్డి చేయడంతో… ప్రజల్లో ఆయనకే కాస్త పాజిటివ్ ఉంది. ఈ నియోజకవర్గంలో మైనార్టీలు గతంలో.. వైసీపీకి ఓటు వేశారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడమే కారణం. ఈ సారి మైనార్టీల్లో సానుకూల భావం కనిపిస్తోంది. నల్లారి కుటుంబం… ఈ సారి రాజకీయ ఉనికిని కాపాడుకోవడం ఖాయమని… ప్రచారం జరుగుతోంది.