పిట్టకొంచె కూత ఘనం సంగతేమో గానీ, ఢిల్లీలో అధికారం దక్కించుకున్న ఆమ్ఆద్మీ పార్టీకి సమస్యలు కొండలా పెరుగుతున్నాయి. ఢిల్లీలో గెలిచిన ఆనందాన్ని ఆస్వాదించకుండానే యోగేంద్ర యాదవ్, ప్రశాంత భూషణ్ ల తిరుగుబాటు కొంత కాలం తలనొప్పిగా మారింది. మొత్తానికి వారిని పార్టీనుంచి గెంటేశారు. వారితో పాటే అనేక మంది నాయకులు, కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పారు. కేజ్రీవాల్ బృందం విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇప్పుడు పంజాబ్ లో ఆప్ చీలిక దిశగా సాగుతోంది. పార్టీకి ఎంపీలను అందించిన రాష్ట్రం పంజాబ్. ఒకటీ రెండూ కాదు, ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు ఆప్ కు దక్కాయి. అలాంటి పంజాబ్ లో తిరుగుబాటు ముసలం బయల్దేరింది. పార్టీ అధినాయకత్వం ఢిల్లీలో కూర్చుని అన్ని నిర్ణయాలు తీసుకుంటోందని, తమను సంప్రదించడం లేదని ఎంపీలు, పంజాబ్ రాష్ట్ర నాయకులు గుర్రుగా ఉన్నారు. చివరకు పంజాబ్ లో ప్రచారం గురించి కూడా కేజ్రీవాల్ బృందం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం బాగాలేదని వారి విమర్శిస్తున్నారు.
కేజ్రీవాల్ బృందాన్ని బహిరంగంగా విమర్శిస్తున్న సీనియర్ నాయకుడు దల్లీజ్ సింగ్ ప్రశ్నలకు జవాబులు చెప్పలేని పరిస్థితి. ఆయన లేవనెత్తిన అంశాలకు కౌంటర్ ఇవ్వలేని కేజ్రీవాల్, చివరకు దల్జీత్ సింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే, నలుగురు ఎంపీల్లో ముగ్గురు ఆప్ జాతీయ నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంటు సభ్యులమైనా, తమకు కనీస విలువ ఇవ్వడం లేదనేది వారి ఆవేదన. చివరకు, పంజాబ్ లో పార్టీ విస్తరణ, రాబోయే ఎన్నికల ప్రచార వ్యూహంపైనా ఢిల్లీలో కూర్చున్న వారే నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
పార్టీకి ఎక్కడా ఎంపీలు లేని పరిస్థితుల్లో, నలుగురు ఎంపీలున్న పంజాబ్ కు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? ఇదీ ఎంపీల ప్రశ్న. కానీ కేజ్రీవాల్ బృందం మాత్రం తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని కొందరు బాహాటంగానే ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఒక వేళ ముగ్గురు పార్టీనుంచి బయటకు వెళ్లిపోతే అది పార్టీకి పెద్ద దెబ్బ. మరో ఎంపీ కూడా వారి దారినే అనుసరిస్తారా లేక కేజ్రీవాల్ నాయకత్వానికి సలాం కొడతారా అనేది తేలాలి. పంజాబ్ లో అధికార అకాలీదళ్ వ్యవహార శైలిపై ప్రజల్లో క్రమంగా అసంతృప్తి పెరుగుతోంది. గట్టిగా ప్రయత్నిస్తే అధికారంలోకి రావచ్చని రాష్ట్ర ఆప్ నేతలు ధీమాతో ఉన్నారు. ఒకవేళ ఈ లుకలుకలతో పార్టీ చీలిపోతే, అకాలీదళ్- బీజేపీ కూటమికి అది అనుకోని వరం అవుతుంది. కేజ్రీవాల్ మాత్రం ఏకపక్ష పోకడలను వదలడం లేదు. భిన్నమైన పార్టీ అంటూనే అనేక ఇతర పార్టీల్లా అంతా నామాటే వినాలనే ధోరణితో ఆయన పార్టీని శాసిస్తున్నారని ఇప్పటికి చాలా మంది ఆరోపించారు. ఈ ఆరోపణతోనే ఎంతో మంది పార్టీని వీడి వెళ్లారు. కేజ్రీవాల్ మారతారో లేక పార్టీని ముంచుతారో చూద్దాం.