వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ విజయవాడ, విశాఖల్లో క్రైస్తవ సంఘాలతో సమావేశం పెట్టి తనపై పార్టీ పెట్టాలనే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని చెప్పుకున్నారు. ఆయన తరపున ఏపీలో బీసీ సంఘాల నాయకుడిగా చెలామణిలో ఉన్న శొంఠి నాగరాజు అనే వ్యక్తి వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కోస్తా, ఉత్తరాంధ్రలో బ్రదర్ అనిల్ సమావేశాలు అయిపోయాయని ఇక రాయలసీమలో సమావేశం పెట్టిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తమపై పార్టీ పెట్టాలనే ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతోందని ఆయన చెబుతున్నారు.
బ్రదర్ అనిల్ పార్టీ పెట్టే ఉద్దేశంలోనే ఉన్నారు. ఆయన పలుమార్లు తన అభిప్రాయాన్ని చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ప్రజల్లోకి వెళ్తామంటున్నారు. జగన్‌తో గొడవలున్నాయన్న అభిప్రాయాన్ని ఆయన పరోక్షంగా ప్రజల్లోకి పంపుతున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ పెడితే జగన్‌కు ఇబ్బందేనని .. లాయల్‌గా ఓట్లేసే క్రిస్టియన్లు, కన్వర్టడ్ క్రిస్టియన్లు బ్రదర్ అనిల్ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న విశ్లేషణలు వచ్చాయి . అయితే ఆ తర్వాత ఏం జరిగిందో కానీ బ్రదర్ అనిల్ సైలెంటయిపోయారు. కానీ ఆయన సైలెంట్‌గా లేరని పార్టీ ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
సీఎం జగన్మోహన్ రెడ్డితో షర్మిల కు విభేదాలు వచ్చాయి. ఆస్తి పంపకాల దగ్గర ఆ తేడాలని చెబుతున్నారు. అది నిజమో కాదో కానీ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి అక్కడే పని చేసుకుంటున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. కానీ ఆ పాదయాత్రకు స్పం వస్తున్నట్లుగా ఎవరూ భావించడం లేదు. తెలంగాణ ప్రజలు కూడా పట్టించుకోనట్లే ఉన్నారు. షర్మిల అంటే ఏపీలో రాజకీయాలు చేసుకోవాలన్న అభిప్రాయం ఎక్కువ మంది వినిపిస్తున్నారు . కేబినెట్ విస్తరణ తర్వాత వైసీపీలో పరిస్థితులు చూసి ఎక్కువ మందికి ప్రత్యామ్నాయం అవసరం అనే అనిపించింది. ఈ క్రమంలో బ్రదర్ అనిల్ పెట్టబోయే పార్టీ షర్మిల కోసమేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. బ్రదర్ అనిల్ వెనక్కి తగ్గలేదని.. పార్టీ పెడతారని ఎక్కువ మంది నమ్మకంతో ఉన్నారు.