ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం తన “కొత్తపలుకు”లో తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఇందులోకి జగన్‌ను కూడా లాక్కొచ్చి తనదైన పొలిటికల్ జర్నలిజం చేశారని అనుకోవచ్చు. తెలంగాణపై బీజేపీ బోలెడన్ని ఆశలు పెట్టుకుందని చెప్పిన ఆర్కే.. అది సాకారం కావాలంటే ఏపీలో జగన్‌ను వదిలేయేలాని సలహా ఇస్తున్నారు. ఎందుకు వదిలేయాలో కూడా కారణాలు చెప్పారు. తెలంగాణలో సీమాంధ్రులు కనీసం 25 నియోజకవర్గాల్లో ప్రభావ స్థితిలో ఉన్నారని.. వారు బీజేపీకి ఓటు వేయడం లేదని గుర్తు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సీమాంధ్రుల ప్రభావం ఉన్న చోటల్లా టీఆర్ఎస్ గెలిచింది.. ఇతర చోట్ల బీజేపీ గెలిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రులు కేసీఆర్ పట్ల కూడా అంత సంతృప్తిగా లేరు కాబట్టి ఇప్పుడు వారిని జగన్‌ను వదిలేయడం ద్వారా సంతృప్తి పరిచి గెలుపు అవకాశాలు మెరుగుపర్చుకోవాలని సలహా ఇచ్చేశారు. ఈ సలహా బీజేపీ నేతలకు చేరుతుందో లేదో.. నచ్చుతుందో లేదో మనం చెప్పలేం కానీ… ఆర్కే చాలా తెలివిగా బీజేపీపై ఓ పాచిక విసిరాడని ఆనుకోవచ్చు.
అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని తేల్చేశారు. పీకే సర్వేలో వరంగల్ జిల్లాలో అత్యధిగ మెజార్టీ సాధించిన ఓ నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ 30వేల మైనస్‌లో పడిపోయిందట. అలా ఎందుకు పడిపోయిందనేది తెలియక కేసీఆర్ కారణాలు అన్వేషిస్తున్నారని అంటున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. కేసీఆర్ జాతీయరాజకీయాల పేరుతో వందల కోట్లు ప్రజాధనం ఖర్చు పెడుతూ.. తనను ప్రమోట్ చేసుకుంటూడటాన్ని కూడా తప్పు పట్టారు. తెలంగాణ ఎనిమిదో వార్షికోత్సవం రోజున దేశంలో అన్ని పత్రికలకు కేసీఆర్ ప్రకటనలు ఇచ్చారు. ఆ ఖర్చు రూ. రెండు వందల యాభై కోట్లు తెలంగాణ ప్రజల సొమ్మేనంటున్నారు. దీంతో వదిలి పెట్టడం లేదని.. కనీసం రెండు వేల కోట్లతో తన ఇమేజ్ బిల్డింగ్ చేసుకోబోతున్నారని ఆర్కే చెబుతున్నారు.
ఓ వైపు తెలంగాణ ఆర్థిక కష్టాల్లో ఉంది. తెలంగాణలో బిల్లులు రాక సర్పంచ్‌లు.. ఆర్థిక సాయం అందక రైతులు టెన్షన్ పడుతూంటే.. కేసీఆర్ మాత్రం ప్రజాధనాన్ని తన సొంత సొమ్మన్నట్లుగా ఖర్చు పెట్టడం ఖచ్చితంగా తిరుగుబాటుకు దారి తీస్తుందని ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తి పెరిగిపోయిందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ విషయంలో ఇక చేయగలిగిందేమీ లేదని కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారని.. కానీ అది ఆయనన్ను జైలుకు పంపిన ఆశ్చర్యం లేదని ఆర్కే పరోక్షంగా చెబుతున్నారు.
ప్రస్తుతం కేసీఆర్ అవినీతి చిట్టా.. కమిషన్ల గుట్టు అంతా కేంద్రం సేకరించి పెట్టిందని.. ఎప్పుడైనా సీఎం జగన్ కేసుల్లో సాక్ష్యాధారాలతో సహా ఇరుక్కుపోయినట్లుగా ఇరికించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఆర్కే చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లేనని.. ఆర్కే చెబుతున్నారు. అప్పుడు తెలంగాణ సమాజం నుంచి కూడా ఆయనకు మద్దతు లభించని.. పైగా సొంత పార్టీ నేతలు.. కాంగ్రెస్, బీజేపీల్లో జంపవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తేల్చారు. మొత్తంగా కేసీఆర్‌కు ముందుంది మొసళ్ల పండగ అనేది చెప్పకనే చెప్పారు. మరి ఆర్కే వి హెచ్చరికలా.. జాగ్రత్త పడాలని మేల్కొలుపులా అన్నది వాళ్లకే తెలియాలి.