ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రులు సన్నాసులని ఢిల్లీకి తెలిసిపోయిందని తన ప్రెస్మీట్లో ఆవేదన చెందారు కానీ… ఆంధ్రులు ఉత్త వెధవాయులని ఎప్పుడో చెప్పారని.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ .. తన వారంతపు ఆర్టికల్ కొత్తపలుకులో వెటకారం చేశారు. ఆయన ఇలా వెటకారం చేయడానికి కారణం… ప్రజలు అలా చూస్తూ ఉండటమే. రాష్ట్రం నాశనమైపోతున్నా… బంగారు భవిష్యత్ ఇచ్చేఅమరావతిని నిర్వీర్యం చేసినా.. రాష్ట్రాన్ని సస్యశ్యామం చేసే పోలవరం ప్రాజెక్ట్‌ను అడ్డగోలుగా ఆపేస్తున్నా.. ఆంధ్రుల్లో కనీస స్పందన లేకపోవడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు పోరాట యోధులకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ .. ఇప్పుడు కులం, మతం మాయలో పడి.. మొత్తానికే అస్థిత్వాన్ని కోల్పోతోందని ఆయన తన ఆర్టికల్‌లో కనిపించని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ నిధుల విషయంలో.. కేంద్ర ప్రభుత్వం ఇన్ని నాటకాలు ఆడుతూంటే.. కనీసం ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ప్రభుత్వాధినేత సైలెంట్‌గా ఉంటున్నారు. అసలు పునరావాసం లేని సాగునీటి ప్రాజెక్ట్ ఎక్కడ ఉటుందని కేంద్రాన్ని నిలదీసే బాధ్యత గల వ్యక్తులు ఎక్కడా ఏపీలో కనిపించకపోవడంపై ఆర్కేని ఆశ్చర్యపరుస్తోంది. ఆయన పొరుగు రాష్ట్రాల్లో జరిగిన జల్లికట్టు సహా అనేక ఉద్యమాలను ఆర్టికల్‌లో వివరించి..వారి పోరాట పటిమను ప్రశంశించారు. కానీ ఏపీలో ప్రజలు మాత్రం తమ కాళ్ల కిందకు పాలకులు నీళ్లు తీసుకు వస్తున్నా… చలించడం లేదని విస్మయానికి గురవుతున్నారు. ప్రభుత్వం వేసే ముష్టి కోసం అర్రులు చాచే దౌర్భాగ్యాని పడిపోయారని అంటున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో బయటకు తెలియని ఓ విషయాన్ని ఆర్కే వెల్లడించారు. అదేమిటంటే.. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం. అలా పెంచినట్లుగా బయటకు చెప్పుకుంటే.. పొరుగు రాష్ట్రాల నుంచి సమస్యలు వస్తాయని ప్రభుత్వాలు చెప్పుకోలేకపోతున్నాయట. అందుకే ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగిందని చెబుతున్నారు. జగన్‌కు ఈ విషయం తెలిసినా… చంద్రబాబుపై అవినీతి ముద్ర వేయడానికి .. అంచనాలు పెంపుపై కేంద్రానికి పదే పదే ఫిర్యాదు చేశారని అదే శాపంగా మారిందని ఆర్కే విశ్లేషిస్తున్నారు.
మొత్తానికి ఆర్కే పలుకులో కొద్ది వారాల నుంచి స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డిపై డైరక్ట్ ఎటాక్ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో దాన్ని ఇన్ డైరక్ట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పేమీ లేదన్నట్లుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఓ వారం సలహాదారులపైన.. మరో వారం అధికారులపైన.. మరో వారం ఆయన పార్టీ పెద్దలపైనా నెపం నెట్టేస్తున్నారు. ఈ సారి కూడా అదే తరహాలో ఆర్టికల్ సాగింది. తప్పు జగన్‌ది కాదు.. ప్రజలదేనని తేల్చేస్తున్నారు. ఓ పద్దతి ప్రకారం.. ఆర్కే.. ఇలా విశ్లేషిస్తున్నారని అనుకోవచ్చు.