ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కేసీఆర్ భయపడే ఫామ్ హౌస్ వీడియో ఫైల్స్‌ను బయట పెట్టలేదని , డబ్బుల రికవరీ చూపించలేదని గత వారం కొత్తపలుకులో కామెంట్ చేసిన ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే.. ఈ సారి వీడియోలు బయట పెట్టినా కూడా అదే వాదన వినిపించారు. కేసీఆర్ భయపడ్డారని.. అందుకే ఆయన మోదీ , షాలను దూషించలేదని తీర్మానించారు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో కేసీఆర్ భాష వేరుగా ఉంటుందని .. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మోదీ , షాలను.. తన జోలికి రావొద్దని బతిమాలుకుంటున్నట్లుగా ఉందని విశ్లేషించారు
ఈ వారం కొత్త పలుకులో ఆర్కే.. చాలా వరకూ ప్రజాస్వామ్యంపై బాధపడ్డారు. ఎలా ఖర్చులో మునిగి తేలుతుందో వివరించారు. మునుగోడులో అసలు ఓడిపోయింది ఎన్నికల సంఘమేనన్నారు. మరి ఆంధ్రజ్యోతి మాత్రం మునుగోడులో జరిగిన అరాచకాలను.. ఏ పార్టీ ఎంతెంత పంచిందో బయటపెట్టగలిగిందా ? కేసీఆర్ .. టీఆర్ఎస్ పార్టీ ఎంత పెద్ద మొత్తంలో పంచిందో చెప్పగలిగిందా ? అంటే… అదేదో ఆయా పార్టీల ఘనత అన్నట్లుగానే ఇతర మీడియాలతో కలిసి చెప్పింది కానీ.. తప్పని చెప్పేలా ఎక్కడా ప్రచారం చేయలేదు. కనీసం ఈసీ దృష్టికి వెళ్లేలా కథనాలు ప్రసారం చేయలేదు. మీడియాతో తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారో లేదో ఆర్కేనే విశ్లేషించుకోవాల్సి ఉంది.
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా ఆ పార్టీలో పెద్దగా ఉత్సాహం కనిపించదని ఆర్కే అంచనా. ఎందుకంటే పెరిగిపోయిన ఖర్చులే దీనికికారణం. మరి అధికార పార్టీ.. అన్నీ ఖర్చులూ కేసీఆరే పార్టీ తరపున భరిస్తారు.. ఆ ఎమ్మెల్యేలకు అంత భయం ఉంటే.. విపక్షాలు ఇక పోటీ చేయడం కూడా సాధ్యం కాదు. ఇదే విషయాన్ని ఆర్కే చెప్పి బాధపడ్డారు. ఈ ప్రజాస్వామ్య పయనంపై ఆవేదన తర్వా… ఫామ్ హౌస్ ఫైల్స్‌లోనూ కేసీఆర్ తీరుపై ఆర్కే కి అంత నమ్మకం కలగలేదు.
కేసీఆర్ మోదీ, షా లను దూషిస్తే… వారు వెంటనే విరుచుకుపడితే.. దాన్ని చూడాలని.. ఆర్కే అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఆర్కే మాటల్లో చాలావరకూ కేసీఆర్‌పై.. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు విరుచుకుపడాలనే కోరిక అంతర్గతంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటివి జరగకపోతూండటంతో. ఆయన కూడా నిరాశావాదమైన మాటలు మాట్లాడుతున్నారు. ప్రధాని, హోంమంత్రులను దూషిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత అమాయకుడు కాదుగా కేసీఆర్. ఇప్పుడు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో.. ఆర్కే.. కోరికను మోదీ , షా నెరవేరుస్తారో లేదో మరి !