ఎన్నికల్లో ఓటేసి ఉత్సాహంతో సొంతూరు నుంచి బయల్దేరిన వారిని ఊహించని ప్రమాదం వెంటాడింది. ఎంచక్కా కబుర్లతో కొద్ది గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుకుంటామని ఆనందోత్సాహాలతో గడుపుతోన్న వారిని మృత్యువు పలకరించింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే దారుణం జరిగిపోయింది.పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అరవింద్ ట్రావెల్స్ కు చెందినా బస్సు పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్ళాల్సి ఉండగా అనుకోని విధంగా ప్రమాదానికి గురైంది. చిలకలూరిపేట మండలం అన్నంబొట్లవారిపాలెం – పసుమర్రు గ్రామాల మధ్య మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో బస్సును ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా ఆరుగురు సజీవ సహనం అయ్యారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సులో నుంచి క్షతగాత్రుల ఆర్తనాదాలు ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నింపింది. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. తెల్లారితే తమ కుటుంబీకులు హైదరాబాద్ చేరుకుంటారనుకుంటే ఇలా బస్సు ప్రమాదంలో మృతి చెందారని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.