“మా” ఎన్నికలను పర్యవేక్షించి మంచు విష్ణును గెలిపించేందుకు వైసీపీ తరపున ఎన్నికల పరిశీలకుడిగా ఓ నొటొరియస్ క్రిమినల్‌ను పంపినట్లుగా ప్రకాష్ రాజ్ కొత్తగా ఆరోపణలు చేశాయి. ఎన్నికలు జరుగుతున్నసమయంలో.. కౌంటింగ్‌లో ఫోన్లో మాట్లాడుతూ.. సీరియస్‌గా తిరుగుతున్న వ్యక్తి ఫోటోలు, వీడియోలతో ఆయన ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు. “మా”సభ్యుడు కానీ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రౌడీషీటర్ లోపలికి ఎలా వచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇది ఆరంభం మాత్రమేనని సీసీ టీవీ ఫుటేజీ ఇస్తే మొత్తం ఏం జరిగిందో ప్రజల ముందు పెడతానని ప్రకటించారు.
ప్రకాష్ రాజ్ బయట పెట్టిన ఆ రౌడీషీటర్ పేరు నూకల సాంబశివరావు. ఆయన జగ్గయ్యపేటకు చెందిన వైసీపీ నేత. ఆయనపై హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసుతో పాటు పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. అక్కడ రౌడిషీట్ కూడా ఉంది. ఆయన ఎందుకు “మా”ఎన్నికలకు వచ్చాడో ఎవరికీ తెలియదు కానీ… మంచు ఫ్యామిలీకి అవసరమైన వైసీపీ మార్క్ సహకారం అందించేందుకు వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు.
మంచు విష్ణు ఈ రోజు “మా”కు సంబంధించి ఓ గుడ్ న్యూస్ ప్రకటిస్తానని గురువారం ప్రకటించారు. శుక్రవారం ఆ అంశాన్ని వెల్లడిస్తానన్నారు. మంచు విష్ణు ఆ ప్రకటన చేయక ముందే ప్రకాష్ రాజ్ షాకింగ్ న్యూస్ ఇచ్చినట్లయింది. ఇప్పుడు ఈ అంశంపై మంచు విష్ణు టీం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.