రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ ఖాయమైపోయింది. మార్చి 25వ తేదీన తమ సినిమాను విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. దీంతో కొన్ని సినిమాలకు స్పష్టత మరికొన్నింటికి అస్పష్టత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే..
కరోనా కారణంగా నాలుగు సార్లు వాయిదా పడ్డ ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని ఖాయం చేసుకుంది. జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన సినిమా ఒమిక్రాన్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే, వాయిదా పడే సమయంలో మార్చి 18 కానీ ఏప్రిల్ 28 కానీ విడుదల చేస్తామని ప్రకటించిన ఆర్ఆర్ యూనిట్, తాజాగా మార్చి 25వ తేదీని విడుదల తేదీ గా ప్రకటించింది. కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ నటించిన ఆఖరి చిత్రం విడుదల సందర్భంగా మార్చి 18 నుండి 23వ తేదీ వరకు వేరే ఇతర చిత్రాలను ప్రదర్శించకూడదు అని ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా నిర్ణయించుకోవడంతో వారి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆర్ ఆర్ ఆర్ సినిమా యూనిట్ కూడా తమ తేదీని మార్చి 25వ తేదీకి జరుపుకుంది దీంతో ఆచార్య సినిమా ఏప్రిల్ 29న రావడం కూడా ఖాయమైపోయింది. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏప్రిల్ 28 వ తేదీని ఖాయం చేసుకున్నట్లయితే ఆచార్య సినిమా విడుదల తేదీ కూడా మారి ఉండేది.
అయితే ఏప్రిల్ 1న విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ పరిస్థితి విషయంలో కొంత అస్పష్టత నెలకొంది. జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా ని ఆర్ఆర్ సినిమా కోసమే అప్పట్లో వెనక్కి జరిపారు. ఇప్పుడు మార్చి 25 ఏప్రిల్ 1 తేదీల మధ్య కూడా వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో, భీమ్లా నాయక్ ని ఈసారి కూడా ముందుకు గాని వెనక్కి గాని జరిపే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి భీమ్లా నాయక్ విడుదల తేదీపై మరి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.