జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రానికి తరలించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన రఘురామకృష్ణరాజు.. తాజాగా ఏపీ హైకోర్టులోనూ మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఆయన ఉన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రజా ధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఒక్కో శాఖలో జరిగిన అవినీతిపై పూర్తిగా పిటిషన్ లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
అవినీతికి సంబంధించి ఆధారాలను పదుల సంఖ్యలో సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఈ పిటిషన్ పై విచారణ ఎప్పుడు జరుగుతుందో కానీ.. రఘురామ పిటిషన్ దాఖలు చేసిన టైమింగ్ చూస్తే.. గతంలో శంకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ తరహాలో ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ రెడ్డి అక్రమాస్తులపై గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న శంకర్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆదేశాలు అందిన వెంటనే .. రంగంలోకి దిగిన వీవీ లక్ష్మినారాయణ.. మొత్తం అక్రమాస్తుల కేసుల గుట్టు తేల్చారు. చార్జిషీట్లు దాఖలు చేశారు. అయితే ట్రయల్ ప్రారంభం కాకుండా.. రకరకాల పిటిషన్లు వేస్తూ అడ్డుకుంటున్నారు.
తాజాగా రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిల్ అంత కంటే సమగ్రంగా ఉందని.. మనీ రూటింగ్ ఎలా జరిగిదో చాలా స్పష్టంగా వివరిస్తూ.. జగన్ రెడ్డి తో పాటు ఆయన సన్నిహితులు, బంధువులు, ఆయన మడియా సంస్థ ప్రజాధనాన్ని ఎలా దోచుకున్నారో సాక్ష్యాలను వివరిస్తూ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. రఘురామ వరుసగా న్యాయపోరాటాలు ప్రారంభించడం.. ఓ టైం చూసి పిల్స్ దాఖలు చేస్తూండటంతో … త్వరలో ఎవరూ ఊహించని కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.