రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల ‘ఆర్ఆర్ఆర్’ టాలీవుడ్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కల్పిత కథతో రూపుదిద్దుకున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా తారక్ నటన ప్రేక్షకులని మైమరపించింది. ఈ సినిమా చూసిన తర్వాత హాలీవుడ్ సైతం సలాం అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. నటీనటుల నటన, కథ, డైరెక్షన్, విజువలైజేషన్.. ఇలా ప్రతి అంశమూ అద్భుతమంటూ మెచ్చుకుంది. ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే జపాన్‌లో 17 రోజుల్లో పది కోట్ల రూపాలకుపైగా కలెక్షన్స్ సాధించింది. జపాన్ తో పాటు అమెరికా, చైనా లాంటి మిగతా దేశాల ప్రేక్షకులని కూడా ఆకట్టుకున్న ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ లోనే కాదు యావత్ ఇండియన్ సినిమాలోనే మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.
అవార్డులు: ‘ఆర్ఆర్ఆర్’ అవార్డుల వెల్లువ కొనసాగుతోంది. అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే శాటర్న్ అవార్డు ఈ ఏడాది ఈ చిత్రానికి వరించింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ అవార్డు దక్కించుకుంది. అలాగే ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ స్పాట్లైట్ విన్నర్‌గా ఈ చిత్రం నిలిచింది. నటులు, సాంకేతిక నిపుణులందరికీ ఈ అవార్డు దక్కుతుంది. ‘అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగానూ ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటింది. సన్‌సెట్ సర్కిల్ గౌరవం కూడా ఈ చిత్రానికి లభించింది.
ఆస్కార్ కల: ఇప్పటివరకూ ఒక్క భారతీయ సినిమా ఆస్కార్ అవార్డ్ గెలుచుకోలేదు. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ ని ఆస్కార్ కి పంపించే అవకాశం ఉన్నపటికీ ఏవో కారణాలతో ఫిల్మ్ ఇండియన్ ఫెడరేషన్ ఆర్ఆర్ఆర్ ని నామినేట్ చేయలేదు. అయితే ప్రైవేట్ కేటగిరీలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కోసం పోటీపడే పాటల జాబితాలో ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ పాటను ఎంపిక చేశారు. ఇప్పటివరకూ ఐదుగురు భారతీయలు (సత్యజిత్ రే, భాను, రసూల్ పూకుట్టి, ఎ.ఆర్. రెహమాన్, గుల్జార్) మాత్రమే వివిధ కేటగిరీలలో ఆస్కార్ అందుకున్నారు. నాటు నాటు పాటకు అవార్డ్ వస్తే గనుక మరో భారతీయుడి ఆస్కార్ కల తీరినట్లే.