బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి.. నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. మాయావతి పొత్తులు వద్దనడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ముందుగానే కేసీఆర్ తో సంప్రదింపులు జరిపారు. తర్వాత మాయవతి ఎవరితోనూ పొత్తులు ఉండవని లక్నోలో ప్రకటించారు. కానీ తర్వాత.. కేసీఆర్ ఏ కూటమిలో లేనందున ఆయనతో పొత్తులు పెట్టుకునేలా ఒప్పించారు. ఈ మేరకు లక్నో నుంచి పార్టీ ప్రతినిధి వచ్చి కేసీఆర్ తో చర్చించారు. కేసీఆర్ హైదరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీ స్థానాలను బీఎస్పీకి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
అయితే హఠాత్తుగా ప్రవీణ్ కుమార్ తన పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ తో సమావేశమయ్యారు. కేసీఆర్ ఇస్తామన్న సీట్ల ప్రతిపాదనలతో మాయవతి సంతృప్తి చెందలేదని అందుకే పొత్తు వద్దన్నారని చెబుతున్నారు. మాయవతి నిర్ణయంతో అసంతృప్తికి గురైన ప్రవీణ్ కుమార్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ తరపునే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.