కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై బీఆర్ఎస్ నేతల విమర్శలు వ్యూహమో, మరేమిటో కాని నేతల మధ్య సమన్వయం కొరవడినట్లు కనిపిస్తోంది. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… ఈ ఇద్దరు నేతలు ఒకే అంశానికి సంబంధించిన టాపిక్ పై స్వరం వినిపిస్తున్నా, వేర్వేరు విషయాలను ప్రస్తావిస్తుండటంతో బీఆర్ఎస్ లో గందరగోళం కనిపిస్తోంది.
తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులపై కేటీఆర్ అభ్యంతరం తెలుపుతుంటే… ఆర్ఎస్పీ మాత్రం ఏపీకి చెందిన కీరవాణితో రాష్ట్ర గీతానికి స్వరకల్పన చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ లు ఉంటే తప్పేంటని అందులో రాచరిక పోకడలు ఎక్కడున్నాయని నిలదీస్తున్నారు. అవి రాచరికపు ఆనవాళ్లకు నిదర్శనమైతే కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అనే పదాలు రాష్ట్ర గీతంలో ఉన్నాయి కదా.. మరి వాటిని కూడా ఎత్తేస్తున్నారా అని ప్రభుత్వాన్ని కేటీఆర్ ఇరుకున పడేసే ప్రయత్నం చేస్తున్నారు. కాని, ఆర్ఎస్పీ మాత్రం వీటికి కోరస్ ఇవ్వకుండా ఏపీకి చెందిన కీరవాణితో రాష్ట్ర గేయాన్ని ఆలపిస్తే ఊరుకోబోమని వ్యాఖ్యానించడం బీఆర్ఎస్ నే వేలెత్తి చూపేలా ఉంది.
ఎందుకంటే తెలంగాణ ఆత్మ బతుకమ్మ పాటను ఏఆర్ రెహమాన్ చేత బాణీ కట్టించినప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ వాదులకు ఎందుకు ఈ అవకాశం ఇవ్వలేదు..? యదాద్రి ఆలయ డిజైన్ ప్రాజెక్టును ఏపీ చెందిన ఆనంద్ సాయికి కాకుండా తెలంగాణ వాళ్లకు ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు..?కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణలో ఉన్న ఎంతో మంది కాంట్రాక్టర్లను వదిలేసి ఆంధ్రా ప్రాంతానికి చెందిన మెగా ఇంజనీరింగ్ కు ఎందుకు ఇచ్చారని ప్రశ్నలు ఆర్ఎస్పీ వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెరమీదకు వచ్చాయి. దీంతో రేవంత్ ను కార్నర్ చేయబోయి బీఆర్ఎస్ కొత్త విమర్శలను మూటగట్టుకుంటుంది అన్న టాక్ వినిపిస్తోంది.
తెలివిగా కేటీఆర్ ఈ అంశం ప్రస్తావించకుండా అధికారిక చిహ్నంపైనే మాట్లాడుతుంటే… ఆర్ఎస్పీ మాత్రం రాష్ట్ర గేయంపై సెంటిమెంట్ ను రగల్చాలని చేసిన ప్లాన్ వికటించినట్లుగా కనిపిస్తోంది. ఈ విషయంలో కేటీఆర్ అనుసరించిన పంథానే ఆర్ఎస్పీ అనుసరించకుండా కొత్త కోణం వెలికి తీసి గులాబీ పార్టీకి ముళ్ళు గుచ్చుకునేలా చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.