సినిమా అంటే కథ, పాటలు, స్క్రీన్ ప్లే ఎమోషన్, మంచి ట్విస్టులూ, నటీనటులు, సాంకేతిక నిపుణులు. ఇవన్నీ కలిస్తేనే సినిమా. అన్నీ బాగుంటే సరిపోదు. క్రిస్పీగా చెప్పగలిగే నేర్పు ఉండాలి. అది లేక.. చాలా సినిమాలు నష్టపోతున్నాయి. ‘సినిమా బాగుంది కానీ, కాస్త ట్రిమ్ చేయాల్సింది’ అనే మాట ఈమధ్య కాలంలో తరచూ వినిపిస్తోంది. గురువారం విడుదలైన `సరిపోదా శనివారం` చిత్రానికున్న కంప్లైంట్స్ లో ఇదొకటి. 2 గంటల 50 నిమిషాల సినిమా ఇది. అందులో టైటిల్ కార్డ్, మద్యపాన ప్రకటనలూ తీసేస్తే.. 2 గంటల 45 నిమిషాలు. ఈ రోజుల్లో ఇది పెద్ద సినిమా కిందే లెక్క. అందులో కనీసం 15 నిమిషాలు ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉందని రివ్యూలన్నీ ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. బహుశా ఈరోజు, రేపటిలో చిత్రబృందం సినిమాని ట్రిమ్ చేసే అవకాశం కూడా ఉంది.
దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇలా రన్ టైమ్ తో కుస్తీ పడడం ఇదే తొలిసారి కాదు. ఇది వరకు నానితో తీసిన ‘అంటే సుందరానికి’ చిత్రానికీ రన్ టైమ్ గుదిబండగా మారింది. ఆ సినిమా యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోవడానికి కారణం… షార్ప్ గా లేకపోవడమే. అప్పుడు చేసిన తప్పుని వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి సవరించుకోవాల్సింది. కానీ అలా జరగలేదు. దర్శకుడే రచయిత అయిపోతే సమస్య ఇదే. తాను రాసిన ప్రతీ సన్నివేశాన్ని ఇష్టపడడం, రాసిందంతా తీయాలన్న తపన వల్ల రన్ టైమ్ పెరిగిపోతుంది. ప్రతీ విషయాన్నీ డిటైల్డ్ గా చెప్పాలన్న తపన కూడా రన్ టైమ్ పేరుతో సినిమాని ముంచేసే ప్రమాదం ఉంది. ఆగస్టు 15న వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’లు విడుదలైన తరవాత ట్రిమ్ చేశారు. కానీ అప్పటికే సినిమాలు చేజారిపోయాయి. సినిమా ఎంత బాగున్నా, ఈరోజుల్లో 3 గంటల పాటు థియేటర్లో కూర్చోవడం కష్టం. అందుకే స్క్రిప్టు దశలోనే సన్నివేశాలకు కత్తెర్లు పడిపోవాలి. లేదా ఎడిటింగ్ టేబుల్ దగ్గర సినిమా చూస్తున్నప్పుడు నిర్దాక్షణ్యంగా కత్తెర్లు వేయాలి. ముఖ్యంగా నవతరం దర్శకులు సినిమా రన్ టైమ్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే హిట్ సినిమా కంటెంట్ కూడా యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోయే ప్రమాదం ఉంది.