రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాల అప్పగింత త్వరలో ఉంటుందని ఈ మధ్య వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్న యువరాజు, పార్టీ బాధ్యతలు పరిపూర్ణంగా స్వీకరించేందుకు సిద్ధమౌతున్నారు. ఆ ముహూర్తం కూడా ఖరారు అయిపోయిందని తెలుస్తోంది. దీపావళి తరువాత రాహుల్ పట్టాభిషేకం ఖాయం అంటూ రాజస్థాన్ కి చెందిన మాజీ కేంద్రమంత్రి సచిన్ పైలట్ ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఆయనకు పార్టీ బాధ్యతలు ఇవ్వబోతున్నారని చెప్పారు. నిజానికి, ఈ మధ్య పార్టీ వ్యవహారాలన్నీ రాహుల్ స్వయంగా చక్కబెడుతున్నారు. సోనియా అనారోగ్యంతో ఉండటం వల్ల కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ లను రాహుల్ నిర్ణయంతోనే మార్చారు. అంతేకాదు, తనకు అనుకూలమైన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. సీనియర్లను సాగనంపే కార్యక్రమం కూడా యువరాజు ఆదేశాలతోనే జరుగుతున్నట్టు కొన్ని కథనాలు వచ్చాయి.
అయితే, దీపావళి పండుగ తరువాత రాహుల్ అధ్యక్షుడు కాబోతున్నారని చెబుతూనే, వారసత్వ రాజకీయాల గురించి సచిన్ పైలట్ మాట్లాడటం విశేషం. ఒక్క రాహుల్ విషయంలోనే వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో మాత్రమే లేవని, ఈ ఒక్క పార్టీకే పరిమితమైన అంశంగా చూడకూడదని సమర్థించుకున్నారు. అన్ని పార్టీలోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. రాజకీయాల్లో రాణించాలనుకున్నవారికి వారసత్వం అనేది కొంతమేరకు మాత్రమే పనికొస్తుందన్నారు. అంతిమంగా స్వశక్తి, పనితీరు, నైపుణ్యాల ఆధారంగానే ప్రజాదరణ లభిస్తుందని సచిన్ పైలట్ చెప్పారు.
నిజానికి, రాహుల్ వారసత్వ టాపిక్ మీద సచిన్ మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు! ఎందుకంటే, ఆయన కూడా అలానే కదా రాజకీయాల్లోకి వచ్చింది. ‘ఇతర పార్టీల్లో లేవా’ అంటూ సమర్థించుకునే ధోరణిలో ఎంతైనా మాట్లాడొచ్చు. వాస్తవానికి రాజకీయాల్లో ఉండకూడని ధోరణి ఇది. కానీ, వారసత్వం అనేది వ్యవస్థీకృతం అయిపోయింది. ఈ విషయంలో ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచే స్థాయికి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఎదిగిపోయింది. కొన్ని తరాలుగా పార్టీ అధినాయకత్వం కేవలం వారసత్వ ప్రాతిపదికనే చేతులు మారుతోంది. పనితీరు అనేది ఇక్కడ కొలమానమే కాదు! అదే లెక్క అనుకుంటే… రాహుల్ గాంధీ ఎన్ని రాష్ట్రాల్లో పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లారో, ఆయన ప్రభావంతో ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో, పార్టీ విస్తరణ ఏ మేరకు జరిగిందో.. ఇలాంటి లెక్కలన్నీ తీయాల్సి ఉంటుంది. కాబట్టి, ఇలాంటి అంశాల గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. సోనియా తరువాత రాహుల్ అనేది ఎప్పుడో ఫిక్స్. అర్హతా, ప్రజాదరణ, పనితీరు, నైపుణ్యాలు… ఇలాంటివి ఇప్పుడు అప్రస్తుతం!