ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా పదవి వచ్చేసిందని లాక్డౌన్ టైమ్‌లో తమిళనాడు వచ్చి పదవి చేపట్టిన కనగరాజ్‌కు ఇప్పుడు పెట్రోల్ ఖర్చు కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. పైగా.. దాదాపుగా రూ. కోటి వరకూ సొంత డబ్బు ఎదురు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని.. ఎస్ఈసీ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు అందరి కంటే ఎక్కువగా కనగరాజ్‌కు షాక్ ఇచ్చినట్లయింది. ఆయనకు సంబంధించిన ఎలాంటి ఖర్చూ ఎస్ఈసీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. ఆయన వ్యక్తిగతంగా భరించాల్సిందేనని.. స్పష్టం చేసింది. దీంతో కనగరాజ్ కు పెద్ద ఎత్తున బిల్లుల మోత మోగనుంది.
కనగరాజ్ బాధ్యతలు చేపట్టగానే విజయవాడలో ఓ లగ్జరీ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. దానికి నెలకు రూ.1,11,800 అద్దె. ఇటీవల ఈ అద్దె చెల్లించడం లేదని ఓనర్ మీడియాకు ఎక్కారు. ఇప్పటికి ఆరు నెలల వరకూ బకాయి. ఈ బకాయి రూ. ఏడు లక్షళ వరకూ ఉంటుందని అంచనా. ఇప్పటి వరకూ ఎస్ఈసీ తరపున అద్దె చెల్లిస్తారని అనుకున్నారు. కానీ హైకోర్టు ఉత్తర్వులతో ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్లయింది. మొత్తంగా ప్రభుత్వం కనగరాజ్ ఇంటి కోసం రూ. 20 లక్షలు, ఫర్నిచర్ కు రూ. 15 లక్షలు కేటాయించింది. ఈ మొత్తాన్ని ఆయన నుంచి వసూలు చేసే అవకాశం ఉంది. ఎస్ఈసీగా కనగరాజ్ కు సంబంధం లేకపోయినప్పటికీ.. ఢిల్లీలో లాయర్లను పెట్టుకుని ..ఎస్ఈసీ వివాదంలో అఫిడవిట్లు వేశారు. ఇందు కోసం లాయర్లకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంది.
వివాదం ప్రభుత్వానికి, నిమ్మగడ్డ రమేష్‌కు మధ్య ఉంది. అయినప్పటికీ జస్టిస్ కనగరాజ్ ఆ పిటిషన్లలో తన తరుపున వాదించటానికి, అలాగే ఇతర ఖర్చుల కింద, సీనియర్ న్యాయవాది అయిన ఎస్ఎస్ ప్రసాద్ ను పెట్టుకున్నారు, ఆయన ఒకసారి హాజరు అయితే, రూ.3.3 లక్షలు ఫీజు వసూలు చేస్తారు. ఈ కేసు విషయమై 16 సార్లు హాజరు అయ్యారు. అంటే ఆయనకు రూ.58.70 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంది. అలాగే, ఎలక్షన్ కమిషన్ కార్యదర్శి తరుపున, మరో సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హాజరు అయ్యారు. ఆయనకు రూ.18 లక్షల బిల్లు పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టులో వాదించిన లాయర్‌కు రూ.10.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ ఇప్పుడు కనగరాజ్ వ్యక్తిగతంగా కట్టుకోవాల్సి ఉంటుంది. ఎంత లేదన్నా కనీసం రూ. కోటి ఆయనకు ఖర్చవుతున్నట్లుగా తెలుస్తోంది.