- సాయి పల్లవి.. సారీ భానుమతి!
ఈ పిల్ల.. ఒక్క సినిమాతో ఫిదా చేసి పడేసింది.
ఎక్కడ చూసినా సాయి పల్లవి గురించే. - తెలంగాణ డైలాగులు భలే పలికిందనో
- పక్కింటి అమ్మాయిలా కనిపించిందనో
- సినిమా అంతా తన భుజాలపై వేసుకొని నడిపించిందనో
- సాయి పల్లవి లేకపోతే సినిమా లేదనో
– చెప్పుకొంటూనే ఉన్నారు. ఒక్క సినిమాతో మ్యాజిక్ చేసేసిన సాయి పల్లవి.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. ఈ ప్రేమమ్ అమ్మాయితో తెలుగు 360.కామ్ చేసిన చిట్ చాట్ ఇది!
* భానుమతిలా భలే మారిపోయారు… ఆ సీక్రెట్ ఏంటి?
– థ్యాంక్సండీ. ప్రేమమ్ తరవాత నన్నంతా మల్లార్.. మల్లార్ అని పిలవడం మొదలెట్టారు. ఆ పాత్ర ప్రభావం అంతటిది. మళ్లీ అలాంటి పాత్ర దొరుకుతుందనుకోలేదు. శేఖర్ కమ్ముల ఈ కథ గురించి చెప్పగానే.. కచ్చితంగా ప్రేమమ్ స్థాయి సినిమా మరోటి దొరికేసిందనిపించింది. నా వరకూ… ఈ పాత్రకు ఏం చేయగలనో అదే చేశా. అందుకే ఇంత మంచి పేరొచ్చింది.
* భానుమతి పాత్రని క్యారీ చేయగలను అనిపించిందా?
– మొదట్లో కంగారు పడ్డా. చాలా లౌడ్ క్యారెక్టర్ అది. గట్టిగా మాట్లాడుతుంది. అల్లరి చేస్తుంది. అలాంటి పాత్రలో నేను ఇమడగలనా అనిపించింది. కానీ… శేఖర్ సార్ మాత్రం `నువ్వు చేయగలవ్, నీకు ఆ స్థాయి ఉంది` అని ధైర్యం చెప్పేవారు.
* తెలంగాణ యాస అంత బాగా మాట్లాడేశారేంటి?
– ఈ సినిమా గురించి ప్రత్యేకంగా నేర్చుకొన్నా. తెలుగంటే.. నాకు తెలంగాణ యాసే. ఎందుకంటే.. తెలుగు నేర్చుకోవడమే తెలంగాణ యాసతో నేర్చుకొన్నా. సినిమాలోని చాలా డైలాగులు నాకు గుర్తు… చాలా వాటిని ఇప్పటికీ వాడుతున్నా. మరో సెట్‌కి వెళ్లినా తెలంగాణలోనే మాట్లాడుతున్నా.
* థియేటర్లో మీ డైలాగులకు మంచి స్పందన వస్తోంది..
– అవును నిజమే. ఈ సినిమాని నేనూ థియేటర్లో చూశా. పవన్ కల్యాణ్ పేరు ఎత్తగానే.. థియేటర్ అంతా మార్మోగిపోయేవి. నా నటన చూసి అరుస్తున్నారనుకొనేదాన్ని. అయితే అది పవన్ మానియా అని ఆ తరవాతే అర్థమైంది.
* పవన్ కల్యాణ్ సినిమాలు చూశారా?
– గబ్బర్ సింగ్ చూశా. చాలా బాగా నచ్చింది.
* సెట్లో ఇబ్బంది పడిన క్షణాలేమైనా ఉన్నాయా?
– ఒక్కటంటే ఒక్కటీ లేదు. కాకపోతే ఓసారి చిన్న డైలాగులు చెప్పడానికి టేకుల మీద టేకులు తీసుకొన్నా. దానికీ కారణం ఉంది. సాధారణంగా రాత్రి పది దాటితే నాకు నిద్ర వచ్చేస్తుంటుంది. ఒక్క క్షణం కూడా ఉండలేను. ఆ సీన్ మాత్రం పది దాటాక షూట్ చేశారు. అందుకే… ఇబ్బంది పడ్డాను.
* ప్రేమమ్ రీమేక్‌లో అవకాశం వచ్చినా ఎందుకు నటించలేదు?
– నిజానికి ప్రేమమ్ రీమేక్‌లో నటించమని నన్నెవరూ సంప్రదించలేదు. బయట అనుకొన్నారంతే. రీమేక్ సినిమాల్లో నటించడం చాలా కష్టం. ఆ మ్యాజిక్‌ని మళ్లీ రిపీట్ చేయలేమని నా నమ్మకం.
* వరుణ్ తేజ్‌తో నటించడం ఎలా అనిపించింది?
– చాలా కంఫర్ట్ యాక్టర్. చిన్న చిన్న ఫీలింగ్స్‌ని బాగా పలికించాడు.
* ఎంసీఏలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
– అందులోనూ మధ్యతరగతి అమ్మాయిలానే కనిపించనున్నా. ప్రేమమ్, ఫిదాలా ఆ సినిమా కూడా మంచి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది.
* శేఖర్ కమ్ముల వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది?
– ఆయన విభిన్నమైన దర్శకుడు. సెట్లో నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. ‘సాయి పల్లవి..’ అనిపిలుస్తుంటే నాకు కోపం వచ్చేసేది. ‘భానుమతి అని పిలవండి’ అని గొడవపడేదాన్ని. ‘మీరు మీ హీరోయిన్ని నమ్మినప్పుడే కదా, పాత్ర పండేది’ అనేదాన్ని. ఆ తరవాత ఆయన భానుమతి అనే పిలుస్తున్నారు.
* ఇక వరుసగా సినిమాలు చేస్తారా?
– ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే వన్ బై వన్ చేస్తున్నా. నాకు డాక్టర్ కావాలని వుంది. తప్పకుండా అవుతా. ఈమధ్యలో వీలైనన్ని సినిమాలు చేస్తా.
* ఓకే.. ఆల్ ద బెస్ట్
– థ్యాంక్యూ