ఆంధ్రా క్రికెట్ ను కబ్జా చేసిన సాయిరెడ్డిని క్లీన్ బౌల్డ్ చేసేశారు. ఆయన అల్లుడి సోదరుడు అరబిందో శరత్ చంద్రారెడ్డి, సోదరుడు , విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డిని అధ్యక్ష ఉపాధ్యక్షులుగా పెట్టుకుని .. గోపీనాథ్ రెడ్డి అనే వ్యక్తితో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ను నడిపించిన సాయిరెడ్డికి ఇప్పుడు అసలైన షాక్ తగిలింది. ఎపెక్స్ కౌన్సిల్ మొత్తం 21వ తేదీన సమావేశంలో రాజీనామా చేయనున్నారు.
ఆంధ్రా క్రికెట్ లో సాయిరెడ్డి అదికారిక కబ్జా
ఏపీలో వైసీపీ అధికారంలోకి రాక ముందు క్రికెట్ రాజకీయాల్లో అసలైన రాజకీయ నేతల ప్రమేయం తక్కువగా ఉండేది. చాముండేశ్వరి నాథ్ తో పాటు గోకరాజు గంగరాజు వంటి వాళ్లు క్రికెట్ వ్యవహారాలు చూసుకునేవారు. ఏపీకి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు అందులో భాగం అయ్యేవారు. కానీ జగన్ సీఎం అయ్యాక సాయిరెడ్డి విశ్వరూపం చూపించారు. అందర్నీ వెళ్లగొట్టేశారు. తన అల్లుడ్ని… ఆయన సోదరుడ్ని కీలక పొజిషన్లలో కూర్చోబెట్టారు. తన బినామీగా పేరున్న వ్యాపారి గోపీనాథ్ రెడ్డితో అసలు క్రికెట్ వ్యాపారం ప్రారంభించారు.
దోచుకుని వాటాలు పంచుకున్న గోపీనాథ్, సాయిరెడ్డి
క్రికెట్ లో ఎంత దోచుకుంటే అంతే సాయిరెడ్డి, గోపీనాథ్ వాటాలు పంచుకునేవారు. వీరు ఏసీఏను చేతుల్లోకి తీసుకోక ముందు 120 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేవి. ఇప్పుడు ఇరవై కోట్లు కూడా లేవని చెబుతున్నారు. బీసీసీఐ నుంచి ఏటా వంద కోట్ల వరకూ నిధులు వస్తాయి. ఆ మొత్తాన్ని అడ్డగోలుగా ఖర్చు పెట్టేసేవారు. రంజీ క్రికెట్లో ప్లేయర్స్ ను ప్రతిభ మేరకు కాకుండా.. పలుకుబడి.. డబ్బులు చెల్లించేవారికి ఇచ్చేవారు. అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించాల్సి వస్తే బ్లాక్ టిక్కెట్ల దందా మామూలుగా ఉండేది కాదు. ఏసీబీ నిధుల్ని కడప, పులివెందుల్లోనే యాభై కోట్ల వరకూ ఖర్చు పెట్టేశారు.
దొరికిపోతామని భయంతోనే రాజీనామా !
ఏసీఏలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయన్నది హనుమ విహారి ఉదంతంతోనే బయటపడింది. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన ఆయనను పదిహేడో నెంబర్ ఆటగాడితో తిట్టించారు. చివరికి జట్టు నుంచి వెళ్లిపోయేలా వేధించారు. ఆ ఆటగాడు వైసీపీ లీడర్ కొడుకు. వేరే స్టేట్ తో ఆడుకునేందుకు ఎన్వోసీ ఇవ్వమని విహారి అడిగినా ఇవ్వలేదు. టీడీపీ గెలిచిన రోజున ఇచ్చారు. తమ నిర్వాకాలన్నీ బయటపడతాయని.. జైళ్లకు పోవాల్సి వస్తుందన్నభయంతో వైదొలిగేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.
ఏసీఏ కొత్త చీఫ్ గా విజయవాడ ఎంపీ శివనాథ్ !
కొత్త అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకు ఓ నెల రోజు సమయం పడుతుంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ శివనాథ్ ను ఏసీఏ కొత్త అధ్యక్షుడిగా అయితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. క్లబ్ లు.. జిల్లాల క్రికెట్ అసోసియేషన్ల నుంచి శివనాథ్ కు మద్దతు లభిస్తోంది.