ఆళ్ల అయోధ్య రామిరెడ్డి , కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి కూడా రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయబోతున్నారని వైసీపీలో గుప్పుమంటోంది. ఆళ్ల అయోధ్యరామిరెడ్డి జగన్ బినామీ. ఆయన పార్టీని నడిపిన వాళ్లలో ఒకరు. ఆయన రాజీనామా అంటే వైసీపీ నేతలెవరూ నమ్మడం లేదు. అలాగే లాయర్ నిరంజన్ రెడ్డికి పార్టీ మారాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయనకు లాయర్ ఫీజు కింద రాజ్యసభ స భ్యత్వం ఇచ్చారేమో కానీ.. ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నదే లేదు. ఇక కృష్ణయ్యకు ఎందుకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారో ఎవరికీ తెలియదు.
వారంతా వైసీపీపై .. జగన్ పై అసంతృప్తి వ్యక్తం చేసి.. పార్టీ మారిపోవాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు అసంతృప్తి చెందాల్సిన అవసరమే వారికి లేనప్పుడు ఈ ప్రచారం ఎందుకన్నది అసలు సమస్య. అక్కడే అసలు పాయింట్ ని పట్టుకోవచ్చని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుల్ని ఎన్డీఏ కూటమిలోకి పంపుతోంది.. జగన్, సజ్జలేనని వైసీపీలోనే బహిరంగ ప్రచారం జరుగుతోంది. ఏదో డీల్ మాట్లాడుకుని ఈ వ్యవహారాన్ని కానిచ్చేస్తున్నారని అంటున్నారు.
గతంలో టీడీపీ ఓడిపోయాక.. ఒక్క ఎంపీ మినహా అందరూ… బీజేపీలో చేరిపోయారు. చంద్రబాబే బీజేపీలోకి పంపారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే తరహాలో వైసీపీ ఎంపీల్ని జగన్ బీజేపీ కూటమి పార్టీల్లోకి పంపుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఆత్మహత్యా సదృశమని.. పార్టీకి ఉన్న ఒక్క బలాన్ని కూడా త్యాగం చేస్తే తర్వాత పట్టించుకునేవారు కూడా ఉండరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ లండన్ నుంచి వచ్చే సరికి వ్యూహం అమలు చేసేస్తారని అంటున్నారు.