వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరులో అనూహ్యమైన మార్పు వచ్చింది. అంతకు ముందు కోర్టులంటే నమ్మకం లేదని.. న్యాయమూర్తులను వేరే ఎవరో మ్యానేజ్ చేస్తున్నారని నిస్సంకోచంగా ఆరోపణలు చేసేవారు.. ఇప్పుడు.. ఇప్పుడు న్యాయవ్యవస్థ మీద ఎక్కడా లేని నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా..రాజధాని విషయంలోనూ అదే తరహా ప్రకటనలు చేస్తున్నారు. తాజా ప్రభుత్వ ముఖ్య సలహాదారులు… షాడో సీఎంగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి నోటి వెంట కూడా అదే తరహా మాట వచ్చింది. కోర్టులపై నమ్మకం ఉందని.. బలమైన వాదనలు వినిపించి.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను.. నాలుగైదు నెలల్లో విశాఖ తరలిస్తామని ప్రకటించేశారు.
ప్రభుత్వం తల్చుకుంటే నాలుగైదు నెలలు అవసరం లేదు.. ఇప్పుడే తీసుకెళ్లిపోవచ్చు. అలా తీసుకున్న నిర్ణయాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అయినా ఇప్పుడు కోర్టులపై అంత నమ్మకం ఎందుకు ప్రదర్శిస్తున్నారో కొంచెం సస్పెన్స్ గానే ఉంది. వారి బలమైన వాదనలు.. ఇప్పుడు కోర్టుల్లో బాగా పని చేస్తున్నాయి. న్యాయపరిభాషలో సెటిల్డ్ లాగా చెప్పుకునే కొన్ని అంశాలపై న్యాయమూర్తులు ఎప్పుడూ వ్యతిరేకంగా తీర్పు ఇవ్వారు. అలాంటి సెటిల్డ్ లాలో.. అంశం… ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకోకపోవడం. అయితే అనూహ్యంగా ఏపీ సర్కార్ తరపు న్యాయవాదులు వాదించిన బలమైన వాదనలకు… ఆ సెటిల్డ్ లా కూడా.. వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం ఎస్ఈసీ ఇదే సెటిల్డ్ లా గురించి చెబుతూ..డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. కానీ ఆయనకు స్టే వచ్చినంత వేగంగా.. రెస్పాన్స్ రాలేదు.
ఇప్పుడు రాజధాని విషయంలోనూ.. తమకు అదే స్థాయిలో న్యాయం జరుగుతుందని… ఏపీ సర్కార్ పెద్దలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే.. నాలుగైదు నెలల్లో తరలించేస్తామని చెబుతున్నారు. సీఎంఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని జగన్మోహన్ రెడ్డి ఓ సందర్భంలో అసెంబ్లీలో చెప్పారు. ఈ ప్రకారం కోర్టులు కూడా ఏమీ చేయలేవు. కాకపోతే.. కోర్టులు… ప్రభుత్వ నిర్ణయం వల్ల నష్టపోయిన వారికి న్యాయం చేయమని చెబుతాయి. ఆ న్యాయం ఎలా ఉంటుందనేదే ఆసక్తికరం. రాజధాని తరలింపు వల్ల నష్టపోయే వారికి అన్యాయం చేయమని కోర్టులు కూడా చెప్పవు కదా..!?