రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు.. ఇంకా చెప్పాలంటే డి-ఫ్యాక్టో సీఎంగా పవర్ చెలాయిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పట్లాగే ప్రెస్మీట్ పెట్టారు. అయితే ఆయన అసహనానికి గురయ్యారు. మీడియాపై విరుచుకుపడ్డారు. ఆ మీడియా సంస్థల్ని తొక్కేయాలని చిందులేశారు. బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇంకా చాలా చాలా అన్నారు. అవి అసలు మీడియా సంస్థలే కాదన్నారు. ఇన్ని మాటలన్న ఆయన అచ్చమైన రాజకీయ నాయకుడు అయితే.. ఆ మాత్రం కడుపు మంట ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ ఆయన రాజకీయ నాయకుడు కాదు.. జర్నలిస్టు నుంచి ఎదిగిన నేత. ఇప్పటికీ జర్నలిస్టే అనుకోవాలి. ఎందుకంటే సాక్షితో పాటు వైసీపీ అనుబంధంగా పేరు పడిన మీడియా సంస్థలన్నింటికీ ఆయన అనధికారిక ఎడిటర్.
ఆయన స్టోరీ యాంగిల్స్ కూడా చెప్పించి స్టోరీలు చేయిస్తూంటాడని.. సీఐడీ సోదాలు జరిపినప్పుడు.. ఎప్పుడెప్పుడు ఎలాంటి వార్తలు బ్రేక్ చేయాలో కూడా చెబుతూంటారని అందరికీ తెలుసు. అంత పెద్ద జర్నలిస్టు… మీడియా సంస్థలపై విరుచుకుపడటమే ఇప్పుడు అందరిలోనూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే ఓటీఎస్ పథకంపై ప్రజల్లో భయాదోళనలు రెచ్చగొట్టడం అట. జగన్మోహన్ రెడ్డి తాము అధికారలంలోకి వస్తే ఇళ్ల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. అయినా అమలు చేయకపోగా రూ. పది వేలు, రూ. ఇరవై వేలు వసూలు చేస్తున్నారు. దీన్నే ప్రజలు ప్రశ్నించేలా మీడియా కథనాలు ఇస్తోంది. ప్రజాస్వామ్యంలో పత్రికల విధి అదే. జర్నలిస్టు సజ్జలకు తెలియందేమీ కాదు. అసలు ఏమీ లేకపోయినా ఆయన నేతృత్వంలోని సాక్షి మీడియా ఎంతగా చెలరేగిపోయిందో… తప్పుడు వార్తలు, కథనాలు… ఎలా వండి వార్చిందో రోజుకో దృష్టాంతం.. వెలుగుచూస్తూనే ఉంది.
అలాంటి మీడియా సంస్థను తన కనుసైగలతో నడిపిన సజ్జలకు ఇప్పుడు నిజాలు చెబుతున్న పత్రికలంటే కడుపు మంటరావడం సహజం కావొచ్చని ఇతర జర్నలిస్టుల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నారు.. అంతులేని అధికారం అనుభవిస్తున్నారు… ఇలాంటి సమయంలో తమకు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే రాజకీయ నేతలకు కోపం రావడం సహజమే కానీ జర్నలిజం అనే ట్యాగ్ పెట్టుకుని ఎదిగిన సజ్జలకు కోపం రావడం మాత్రం అనూహ్యమేనని చెప్పుకోవచ్చు. ఆ విషయం ఆయన గుర్తిస్తేనే సరి..లేకపోతే పతనం వైపు వెళ్తున్నట్లే. ఈ విషయం ఆయన ఇప్పుడు తెలుసుకుంటారా.. లేకపోతే పతనమైన తర్వాత తెలుసుకుంటారా అన్నది తర్వాత సంగతి.