వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఊహించిన దాని కంటే ఎక్కువగానే కనిపించింది. చాలా మంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అలాంటి ఆశలు కల్పించారు. చివరికి హ్యాండిచ్చారు. అయితే ఎవరూ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అనలేదు. అందరూ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డినే అన్నారు. ఆయనే అంతా చేస్తున్నారని మండి పడుతున్నారు. సుచరిత ఇంటిదగ్గర బహిరంగంగా సజ్జలకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి…. మంత్రి పదవులు పోగొట్టుకున్న, దక్కని వారిలో అంతర్గతంగా ఈ సజ్జల ఎవరు అనే ప్రశ్న రీసౌండ్‌తో వస్తోంది.
జగన్ పేరుతో తానే అధికారం చెలాయిస్తున్న సజ్జల !
పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో సజ్జల జోక్యం మితి మీరిపోతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏ విషయం అయినా ఆయనతో పంచుకోవాల్సిందే. సీఎంవోను కూడా సజ్జల గుప్పిట్లో పెట్టుకున్నారని అన్నీ అక్కడ్నుంచి ఆయనే నడిపిస్తున్నారన్న అసంతృప్తి వైసీపీలో ప్రారంభమైంది. జగన్‌కు పార్టీ నేతలు, క్యాడర్‌కు మధ్య అడ్డుగోడలా సజ్జల ఉండి గ్యాప్ పెంచుతున్నారన్న వాదన వినిపిస్తోంది. పార్టీ నేతల్ని ఎవర్నీ కలవనివ్వడకపోవడంతో పాటు ఎవర్ని ఏ స్థాయిలో బుజ్జగించాలో కూడా ఆయనే డిసైండ్ చేస్తున్నారు. చివరికి బాలినేని విషయంలో ఆయన మూడు సార్లు ఇంటికి వెళ్లారు కానీ సుచరితను పట్టించుకోలేదు.
జగన్ ఆపాయింట్మెంట్ ఉన్నా సజ్జలతోనే భేటీ !
సజ్జల తీరును చాలా మంది సీనియర్ నేతలు నాడు ఎన్టీఆర్ విషయంలో లక్ష్మి పార్వతి వ్యవహరించిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో లక్ష్మి పార్వతి కూడా ఎన్టీఆర్ ఆపాయింట్‌మెంట్లను కూడా తాను అనుకున్నవారికే ఇప్పించేవారు. పూర్తిగా ఎన్టీఆర్‌ను దూరం పెట్టి ఆయన ప్రతినిధిగా ఆమె మాత్రం అందరికీ దర్శనం ఇచ్చేవారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవారు.. మొదట్లో పార్టీ నేతలు అందరూ ఆమె చుట్టూతిరిగేవారు. చివరికి ఆ అసంతృప్తి పార్టీలో తిరుగుబాటుకు కారణం అయింది.
పార్టీ క్యాడర్, నేతల్లో పెరుగుతున్న అసహనం !
రాజకీయాల్లో విధేయతకు చోటు లేదు. ఎంత కాలం ప్రాధాన్యత ఇస్తారో అంత కాలమే విధేయత ఉంటుంది. ఏమైనా మేలు చేస్తారనే నమ్మకం ఉంటేనే విధేయత ఉంటుంది. ప్రస్తుతం వైసీపీ పట్ల అందరూ నమ్మకం కోల్పోయేలా చేయడంలో సజ్జల కీలకంగా ఉంటున్నారని.. ఇది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అంచనా వేయడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది.