గన్నవరం పంచాయతీని తేల్చేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారు. వల్లభనేని వంశీ సైడ్ కావాల్సిందేనన్న సంకేతాలను సజ్జల పరోక్షంగా ఇస్తున్నారు. రెండు వర్గాలను తాడేపల్లి పిలిపించిన సజ్జల దుట్టా రామచంద్రరావు, ఆయన అల్లుడు శివభరత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. వంశీపై వారి వద్ద నుంచి అన్ని రకాల కంప్లైంట్లు తీసుకున్నారు. శివభరత్ రెడ్డి జగన్ భార్య భారతి తరపు బంధువు కూడా కావడంతో ఆ మర్యాదలు ప్రత్యేకంగా లభించాయి. వంశీతో కలిసి పని చేసే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పినట్లుగా వైసీపీ వర్గాలు మీడియాకు చెప్పాయి. దానికి సజ్జల కూడా ఏమీ అనలేదని… వంశీ వివరణ తీసుకుని మళ్లీ పిలుస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది.
వారితో మాట్లాడుతున్నంత సేపు వంశీని బయటే కూర్చోబెట్టిన సజ్జల… దుట్టా వర్గీయులు వెళ్లిపోయిన తర్వాత వంశీని లోపలికి పిలిచారు. కానీ నాలుగైదు నిమిషాలు కూడా మాట్లాడక ముందే తాను హైదరాబాద్ వెళ్లాల్సిన పని ఉందని.. తర్వాత మాట్లాడదామని చెప్పి పంపేశారు. దీంతో వల్లభనేని వంశీకి తీవ్ర అవమానం జరిగినట్లయింది. ఎమ్మెల్యేని అయిన తన వాదనను మొదట వినకుండా… ప్రత్యర్థుల మాటలను వినడమే కాకుండా.. తన వివరణను పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో వంశీ ఫీల్ అయ్యారు. అయితే.. సజ్జల కావాలనే చేశారని.. గన్నవరంలో దుట్టాకే ప్రాధాన్యం అని.. చేతలతో చెప్పారని వైసీపీ వర్గాలంటున్నాయి.
గన్నవరం వైసీపీలో స్పష్టమైన విభజన కనిపిస్తోంది. వంశీకి ఆయన అనుచరులు తప్ప ఎవరూ లేరు. వైసీపీ నేతలు ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా లేరు. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చాలా ఇబ్బందులు పెట్టారని.. ఇప్పుడు కూడా వైసీపీలో చేరి .. తమకు చాన్స్ లేకుండా దోచుకుంటున్నారని అంటున్నారు. ఈ పరిణామాలతో వంశీకి గన్నవరంలో గడ్డు పరిస్థితి ఎదురయినట్లుగా తెలుస్తోంది. తన కంటే మంచి అభ్యర్థి అని భావిస్తే వారికే టిక్కెట్ ఇవ్వమని వంశీ చెబుతున్నారని.. వైసీపీ కూడా అదే అంటోందన్న విషయం వంశీకి ఇంకా అర్థం కాలేదన్న వాదన వినిపిస్తోంది. పరిస్థితి చూస్తే వంశీకి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ డౌటేనని క్లారిటీకి వస్తున్నారు.