ఏపీలో కనీ వినీ ఎరుగని అభివృద్ధి చేశామని.. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోందని.. కానీ ఆ అభివృద్ధి ఏపీ ప్రజలు చూడలేకపోతున్నారని ప్రభుత్వ ముఖ్య సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి బాధపడిపోతున్నారు. గురువారం నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో కార్యక్రమం పెడుతున్నామని.. అందులో జగన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపిస్తామని సజ్జల చెబుతున్నారు. సజ్జల ఎంత కాన్ఫిడెంట్ గా చెబుతారంటే.. కనిపించకపోతే అది మీ తప్పు.. కేసులు పెట్టడం మా తప్పు కాదన్నట్లుగా ఆయన తీరు ఉంది. బస్సు యాత్ర పేరుతో మంత్రులను రోడ్ల మీదకు పంపితే.. పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఇప్పుడు వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో ఇళ్ల మీదకు వెళ్తున్నారు.
ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని.. పేదరికం తగ్గిపోయిందని ..చెబుతూ అదే ప్రజలకు నిరూపిస్తామంటున్నారు. సచివాలయం ద్వారా జరిగిన అభివృద్ధిని ప్రజల ముందు పెడుతున్నాం. ఇది కదా అభివృద్ధి అనే విధంగా ప్రజలకు చూపిస్తామని చెప్పుకొస్తున్నారు. పదే పదే ఓటర్ల ఇళ్లకు వెళ్లినా మీకు లక్షలు ఇచ్చాం. ఓట్లేయమని బెదిరిస్తున్నట్లుగా వైసీపీ కార్యక్రమాలు పెట్టుకుంటోందన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి. ఉద్యోగాల విషయంలోనూ సజ్జల బీభత్సమైన ప్రచారం చేయబోతున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 4.93 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారట. ఈ లెక్కల్ని చెప్పి చెప్పి నిజమని నమ్మించేందుకు ఒకటికి పది సార్లు ఇళ్ల మీదకు వెళ్తున్న వైసీపీని చూసి సామాన్య ప్రజలు విసుక్కుంటున్నారని ఆ పార్టీ పెద్దలు గుర్తించడం లేదు. అయినా సరే.. తాము వస్తామని భయం ఉంటుందన్నట్లుగా ఇళ్ల మీద పడిపోతున్నారు.