ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుల దగ్గర ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. అయితే ఆ పరిష్కారం వారికి మాత్రమే పనికొస్తుంది.. మరొకరికి మాత్రం ఇదేం తెలివితేటలు అనిపిస్తుంది. ఉద్యోగుల నుంచి జీతాలు రికవరీ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. వెంటనే ప్రభుత్వ ముఖ్య సలహాదారు అసలు రికవరీ అనేదే లేదని స్పష్టం చేశారు. ఎవరి దగ్గరా జీతాలు రికవరీ చేయడం లేదన్నారు. అయితే సమస్యే లేదని ఉద్యోగులు అనుకున్నారు కానీ.. వెంటనే… అసలు విషయం చెప్పేశారు.
ఐఆర్ అంటే మధ్యంతర భృతి అనేది తాత్కాలిక అడ్జస్ట్ మెంట్ అని ఇప్పుడు రీఅడ్జస్ట్ మెంట్ చేస్తున్నాం కానీ రికవరీ కాదు అన్నారు. ఈ మాట విన్న తర్వాత ఉద్యోగులు జేబులో చేతులు పెట్టుకుని ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. రికవరీనా.. రీ అడ్జస్ట్ మెంటా అన్నది కాదు .. ఇచ్చిన జీతాలు వెనక్కి తీసుకుంటున్నారా లేదా అన్నదే ముఖ్యం. కానీ ఖచ్చితంగా జీతాలు వెనక్కి తీసుకోవాలనుకుటున్న ప్రభుత్వం అందుకే అనేక రకాల తెలివి తేటల్ని ప్రదర్శిస్తోంది. జీవోలో ఎక్కడా రికవరీ లేదని ప్రభుత్వం చెబుతోంది. రీ అడ్జస్ట్ ఉంటుందన్నమాట.
మొత్తంగా డీఏ బకాయిలన్నింటినీ.. ఈ ఐఆర్ తో కవర్ చేయాలని.. ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా బకాయి చెల్లించకూడదన్నది లక్ష్యం. దానికి తగ్గట్లుగానే సలహాదారులు.. తమ సలహాలను విస్తృతంగా వాడేస్తున్నారు. లెక్కల తెలివి తేటల్ని ప్రదర్శిస్తున్నారు. ఉద్యోగులకు మైండ్ బ్లాంక్ చేస్తున్నారు.