ఊహించినట్టుగానే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను వైకాపా తట్టుకోలేకపోతోంది. ఆ అక్కసును ‘సాక్షి’ ద్వారా వెళ్లగక్కుతోంది. సీఎం ఢిల్లీ పర్యటనను ఎవ్వరూ పట్టించుకోవడం లేదనీ, ఎలాంటి స్పందనా లేదనీ, చంద్రబాబును పలకరించేవారే తప్ప, ఆయనతో కాసేపు మాట్లాడినవారే లేరంటూ సాక్షి రాసేసింది. అంతేకాదు, ఢిల్లీలో తమను పట్టించుకునేవారే ఎవ్వరూ లేరంటూ టీడీపీ నేతలు దిగాలుగా అయిపోయారట! ఏపీ భవన్ లో దిక్కుతోచక కూర్చున్నారట. పార్లమెంటుకు చంద్రబాబు నమస్కరించడాన్ని కూడా ఎద్దేవా చేశారు. గాంధీ విగ్రహానికి నమస్కరించడం కూడా ‘సాక్షి’ కళ్లకు తప్పుగా కనిపిస్తే ఏమనుకోవాలి..? ఇది చాలదన్నట్టుగా.. హోదా పోరాటం పేరుతో ఢిల్లీ వచ్చిన చంద్రబాబు, కొంతమంది న్యాయమూర్తులను రహస్యంగా కలుసుకునే ప్రయత్నాలు చేశారట. ఇక, వైకాపా సాగిస్తున్న ప్రత్యేక హోదా పోరాటం చివరి దశకు చేరుకుందనీ, ఈ తరుణంలో చంద్రబాబు ఢిల్లీ వచ్చి డ్రామాలు చేస్తున్నారంటూ వండి వార్చేశారు.
హోదా పోరాటం పేరుతో దిగజారుడుతనంలో వైకాపా చివరి దశకు చేరుకుంది..! సొంత రాష్ట్ర ప్రయోజనాలు సంకట స్థితిలో ఉంటే, ముఖ్యమంత్రి కేంద్రంతో పోరాటం చేస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షంగా వారు పోషిస్తున్న పాత్ర ఏంటి..? ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భాజపాకి కొమ్ము కాస్తూ, రాష్ట్ర ప్రజలకు వైకాపాగానీ, వారి పత్రిక ‘సాక్షి’గానీ ఇస్తున్న సందేశమేంటీ..? రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు.. మాకు మాత్రం రాజకీయమే ముఖ్యం, కేంద్రం చంద్రబాబును వ్యతిరేకిస్తోంది కాబట్టి, శత్రువుకి శత్రువు మిత్రుడనే సూత్రంతో భాజపా పంచన జగన్ చేరిపోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు ఏమౌతున్నా వారికి అవసరం లేదు.
ఇక, ఢిల్లీలో వైకాపా ఎంపీలు చేస్తున్నదేంటీ.. డ్రామా కాదా..? ప్రతీరోజూ కేంద్రంపై అవిశ్వాసం నోటీసులు ఇస్తుంటారు, కానీ భాజపా నేతలపై విమర్శలు చెయ్యరు. తెల్లారిన దగ్గర నుంచీ ప్రధాని కార్యాలయం చుట్టూ ఒంగి ఒంగి దండాలు పెడుతూ చక్కర్లు కొడుతుంటారు. ఎందుకయ్యా అంటే.. ముఖ్యమంత్రి అవినీతి గురించి ప్రధానికి చెప్పడం తమ గురుతర బాధ్యత అంటారు. ఆ అవినీతి ఆధారాలేంటో మాత్రం బయటపెట్టరు. ఇదంతా ఏంటీ.. వైకాపా చేస్తున్న డ్రామా కాదా! ప్రతీరోజూ ఢిల్లీలో విజయసాయి రెడ్డి చేస్తున్నదేంటీ.. తెరచాటు రాజకీయం కాదా!
ఇక, వైకాపా చేస్తున్న ప్రత్యేక హోదా పోరాటం చివరి దశకు చేరుకుందట..! చివరి దశ అంటే ఏంటి..? ఇంతకీ, హోదా కోసం చేస్తున్న పోరాటం ఎక్కడ..? ఎంపీలు ఢిల్లీలో కూర్చుకుని చంద్రబాబు విమర్శించడం, రాష్ట్రంలో పాదయాత్రలో తిరుగుతూ జగన్ కూడా చంద్రబాబుపై ఆరోపణలు చేయడం.. ఇదా పోరాటం..? హోదా ఇవ్వని కేంద్రంపై విమర్శలు చేసే ధైర్యం, రాష్ట్ర ప్రయోజనాలను అడ్డగోలుగా కాలరాస్తున్న మోడీ మొండి వైఖరిపై తిరబడే దమ్మూ వైకాపాకి లేవు. వారి చేతగానితనం వైపు ప్రజలను ఆలోచించనీయకుండా, ఆ అంశం చర్చనీయం కాకుండా ద్రుష్టి మరల్చే వ్యూహంతో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎదురుదాడికి దిగుతున్నారు.
అంతెందుకు.. ఇన్నాళ్లుగా ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాం, పొడిచేస్తున్నాం అని చెబుతున్నారే, ఇతర పార్టీలను కలిసే ప్రయత్నం వైకాపా నేతలు చేశారా..? ఎందుకు భాజపా చుట్టూనే ప్రదక్షిణలు చేస్తున్నారు..? భాజపా వ్యతిరేక పక్షాలు దేశంలో చాలానే ఉన్నాయిగా. వారందరి మద్దతునూ కూడగట్టే ప్రయత్నం వైకాపా ఎందుకు చేయడం లేదు..? ఎన్సీపీతోగానీ, సమాజ్ వాదీతోగానీ, తృణమూల్ వంటి పార్టీలతో విజయ్ సాయి రెడ్డి ఎందుకు మంతనాలు సాగించే ప్రయత్నం చేయడం లేదు..? వారందరినీ చంద్రబాబు కలిస్తే డ్రామా అంటారు. మరి, వైకాపా చేస్తున్న ఏకపాత్రాభినయాన్ని ఏంటారు..? ఎవరిది డ్రామా..? ఎవరిది ఓవరాక్షన్..? ఏది తెరచాటు రాజకీయం..?