ఇటీవల పవన్ కళ్యాణ్ ఈనాడు పత్రికకు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అమరావతి, జగన్ పాలన, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మొదటి నుండి పవన్ కళ్యాణ్ వార్తలను మీడియా సంస్థలు పక్కన పెడుతూ ఉన్న నేపథ్యంలో, ఆ పార్టీ అభిమానులే పవన్ కళ్యాణ్ వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరుస్తూ ఉన్న నేపథ్యంలో ఈనాడులో వచ్చిన ఈ ఇంటర్వ్యూ ఆ పార్టీ అభిమానులకు కాస్త ఊరట అనిపించింది. స్వతహాగానే పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలలో- ఓట్లు తెచ్చులేకపోయినప్పటికీ ” genuine ” పాలిటిక్స్ చేశాడన్న అభిప్రాయం ఉన్న కారణంగా ఆ ఇంటర్వ్యూ కి పాఠకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే ప్రజలకు పవన్ అభిప్రాయాలు చేరువ కావడం కడుపు మండించిందో ఏమో కానీ, సాక్షి లో పనిచేసే కొమ్మినేని, పవన్ కళ్యాణ్ ని ఇంటర్వ్యూ చేయడం ఈనాడు చేసిన దారుణం అన్న స్థాయిలో రెచ్చిపోతూ తన బ్లాగులో రాసుకొచ్చారు. ఈనాడు పత్రిక కి జర్నలిజం విలువలను గురించి సుద్దులు చెప్పారు. వివరాల్లోకి వెళితే..
కొమ్మినేని తన బ్లాగులో ఈనాడు పత్రిక పవన్ ఇంటర్వ్యూ చేయడాన్ని ఏకపక్షంగా తప్పుపట్టారు. సినిమాల వరకు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇస్తే అందులో ఏమాత్రం తప్పులేదు కానీ రాజకీయంగా ఎందుకు ఇంటర్వ్యూలు చేస్తారంటూ తన కడుపు మంట బయట పెట్టుకున్నారు. ఈనాడు పత్రిక పవన్ కళ్యాణ్ ని ఎందుకు ఇంటర్వ్యూ చేయకూడదో కూడా ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కి కేవలం ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని, పోటీ చేసిన రెండు స్థానాల్లో ఆయన ఓడిపోయాడని, గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీకి దూరంగా ఉన్నాడని, అటువంటి వ్యక్తి ఇంటర్వ్యూ ఈనాడు ఎందుకు తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఏకంగా ఇది జర్నలిజం విలువలకు విరుద్ధం అంటూ ఈనాడు వైఖరిని తప్పు పట్టారు. కేవలం ఎన్నికల్లో గెలిచిన వారికి, ధన బలం అధికార బలం మీడియా బలం ఉన్న వారికి మాత్రమే మాట్లాడే హక్కు ఉంటుందని, ఆ హక్కు ఉన్నవారు మాట్లాడినది మాత్రమే మీడియా సంస్థలు ప్రచురించాలని కొమ్మినేని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అయితే ఈ నాడు పత్రికకు జర్నలిజం విలువలు గురించి సుద్దులు చెప్పే ముందు తాను పనిచేస్తున్న పత్రిక, ఛానల్ లో ఇంతవరకు జర్నలిజం విలువలు పాటిస్తారో చెక్ చేసుకోవాలంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. రామోజీ రావు కుమారుడు సుమన్ తో వ్యక్తిగత అంశాలపై ఇంటర్వ్యూ తీసుకుని వారి కుటుంబ విషయాలను బ్యానర్ పేజీ లో ప్రకటించిన సాక్షిలో పనిచేస్తూ, జర్నలిజం విలువలు గురించి కొమ్మినేని నీతులు చెప్పడం పై నెటిజన్లు నవ్వుకుంటున్నారు. చిరంజీవి కుమార్తె శ్రీజ ఇంట్లోంచి బయటకి వెళ్లిపోయిన సమయంలో సాక్షి తో సహా చాలా పత్రికలు చిరంజీవి కుటుంబ విషయాలను తాటికాయంత వార్తలుగా ప్రచురించినప్పటికీ ఆ సమయంలో ఈనాడు సంయమనం పాటించింది అని, అటువంటి ఈనాడుకి , ఇటువంటి సాక్షి లో పనిచేస్తూ కొమ్మినేని నీతులు చెప్పడం హాస్యాస్పదం అని వారు అభిప్రాయపడుతున్నారు. జర్నలిజం విలువలు గురించి డప్పు కొడుతున్న కొమ్మినేని తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేసే తప్పులను సాక్షిలో ఎంత మేరకు ప్రచురిస్తున్నారో తెలుసుకోవాలని వారు అంటున్నారు.
ఏది ఏమైనా, తాను పనిచేస్తున్న మీడియా సంస్థ అధినేత పార్టీ అడుగులకు మడుగులొత్తే విధంగా వార్తలు ప్రజెంట్ చేసే సాక్షిలో పనిచేస్తూ జర్నలిజం విలువలు గురించి కొమ్మినేని మాట్లాడడం గురువింద గింజ సామెత గుర్తు చేస్తోందని నెటిజన్ల అభిప్రాయం.