ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. కేంద్రం నుంచి సరైన సమయంలో సహకారం అంది ఉంటే, ఈ ఖరీఫ్ సీజన్ కే గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చుండేవారమనీ, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. వచ్చే ఏడాది నాటికే గ్రావిటీ ద్వారా నీరు అందించగలమని చెప్పారు! అంతే… వైకాపా పత్రిక సాక్షికి పూనకం వచ్చేసింది. అదిగో అదిగో… మరోసారి గడువు పొడిగించారు ముఖ్యమంత్రి! ఆయన మోసపూరిత గుణాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ఈ ఏడాది జూన్ నెలాఖరుకు నీళ్లిస్తామని ప్రకటించి, ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. ఇది మోసం దగా కుట్ర వంచన…. ఇలా వాపోతూ ఓ కథనాన్ని ఇవాళ్టి సాక్షి పత్రిక బ్యానర్ గా అచ్చేసింది. పోలవరం పనులు ఈమాత్రమైన కనిపిస్తున్నాయంటే కారణం… దివంగత వైయస్సార్ హయాంలో జరిగినవే అని రాసింది. కేంద్రానికి చంద్రబాబు సరైన లెక్కలు చూపకపోవడం వల్లనే ప్రాజెక్టు ఆలస్యమైందంటూ భాజపా నేతల గళం వినిపించింది.
పోలవరం జాతీయ ప్రాజెక్టు కదా… అలాంటప్పుడు, ఆలస్యానికి కారణం కేంద్ర ప్రభుత్వం చర్యల వల్ల ఉంటుంది కదా అనే కోణమే ఈ కథనంలో లేదు. 2014లో ముంపు గ్రామాలను ఏపీలో కలపడంలో చొరవ చూపిన కేంద్ర ప్రభుత్వం… అక్కడి నుంచీ పోలవరం ప్రాజెక్టు విషయంలో కొర్రీలు పెడుతూ ఆలస్యం చేస్తూనే వచ్చిన వైనం ఈ పత్రికకు అనవసరం! ఐదేళ్లపాటు వరుసగా భాజపా సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఎన్ని వేల కోట్లు కేటాయించిందో సాక్షి ఎందుకు చెప్పలేకపోయింది..? ఏపీకి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాక… పోలవరం ఖర్చంతా తమదే అని అరుణ్ జైట్లీ ప్రకటించారు. మరి, ఆ ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉందా లేదా అనేది సాక్షి పరిగణనలోకి ఎందుకు తీసుకోదు? డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్, హైడ్రో ప్రాజెక్టుపై కేంద్రం వేసిన కోర్రీలు, దాని వల్ల పనుల నిర్మాణంలో జరిగిన జ్యాపం సాక్షికి అక్కర్లేదు. కాపర్ డామ్, రాక్ ఫిల్ డామ్, రేడియేషన్ గేట్ల డిజైన్లను ఇంతవరకూ కేంద్రం ఆమోదించలేదు, అది ఎవరి బాధ్యతో సాక్షి ఎందుకు ప్రస్థావించదు? పనులు వేగవంతం చేయడం కోసం నవయుగ కంపెనీకి కొన్ని పనులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే ప్రయత్నం చేస్తే… ఎంత డ్రామా జరిగిందో అందరికీ తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
తూచ్… ఇవేవీ సాక్షికి అవసరం లేదు. పోలవరం పనులు ఆలస్యమయ్యాంటే కారణం కేవలం చంద్రబాబు నాయుడు వల్లనే! అంతే, దీన్ని అడ్డం పెట్టుకుని, వాస్తవాలను వదిలేసి, వాటిని ప్రజలు పట్టించుకోరులే అనే ధీమాతో ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడమే ఈ పత్రిక బాధ్యతన్నమాట. సరే… బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా గడచిన ఐదేళ్లూ ప్రజల పక్షాన ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, పోలవరం పోలవరం ప్రాజెక్టు వేగవంతానికి చేసిన కృషి ఏంటో కూడా సాక్షి రాస్తే బాగుంటుంది. ఇదే విషయమై జగన్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లారో, కేంద్రంపై ఏ రీతిన ఒత్తిడి తెచ్చారో కూడా రాస్తే కొంత అర్థవంతంగా ఉండేది.