బాహుబలి నుంచీ… దక్షిణాది సినిమాలు బాలీవుడ్ ని కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ సినిమాలకు వసూళ్ల వర్షం కురుస్తుంటే, ఇన్నేసి కలక్షన్లు రప్పించుకోవడం ఎలాగో.. అర్థం కాక బాలీవుడ్ వెర్రి మొహం వేసుకొని చూస్తోంది. అసలు సిసలు హిట్.. ‘జవాన్’ వరకూ బాలీవుడ్ కి రాలేదు. అయితే ఆ సినిమాకి దర్శకుడు ఓ సౌత్ ఇండియన్. మొన్నటికి మొన్న `యానిమల్`లో ఊపిరి పీల్చుకొందామనుకొంటే, అక్కడా ఓ తెలుగు దర్శకుడి ప్రతిభా పాటవాల వల్లే.. సినిమా హిట్టయ్యింది. ఇప్పుడు ‘సలార్’తో బాలీవుడ్ కి కునుకు లేకుండా పోయింది.
సలార్ పక్కా సౌత్ ఇండియన్ సినిమా. ఇందులో బాలీవుడ్ స్టార్లు ఎవరూ లేరు. పైగా కంటెంట్, సెటప్… అంతా సౌత్ టచ్‌తో సాగేదే. కానీ… బాలీవుడ్ లో వసూళ్లు కుమ్ముకుంటోంది. డంకీని పక్కన పెట్టి… సలార్‌కి ఓటేస్తున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు. ఈ విషయంతో బాలీవుడ్ కి మరిన్ని కష్టాలు ఎదురయ్యాయని చెప్పొచ్చు. సౌత్ మసాలా కథల్ని ఎంచుకొంటే తప్ప.. తమకు హిట్టు దక్కదన్న విషయం బాలీవుడ్ కి ‘జవాన్’తో అర్థమైపోయింది. ఇక మీదట ఆ ఫార్ములాలోనే ముందుకు వెళ్లాల్సిన పరిస్థతి వచ్చింది. నిజానికి ‘సలార్’పై బాలీవుడ్ జనాలకు ఎలాంటి ఆసక్తీ లేదు. ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీసు పై ప్రభావం చూపించదని గట్టిగా నమ్మారు. పైగా అదే సమయంలో షారుఖ్ సినిమా `డంకీ` రిలీజ్ కి రెడీ అయ్యింది. కానీ.. డంకీని సలార్ దాటేసి.. అందరినీ నివ్వెర పరిచింది. బాలీవుడ్ రివ్యూలు సలార్‌కి ఏకి పడేశాయి. అర్థం పర్థం లేని కథంటూ విమర్శలకు దిగాయి. సోషల్ మీడియాలో అయితే ప్రభాస్ ని ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇదంతా గిట్టని తనమే. కానీ ఇవేం… సలార్ వసూళ్లని ఆపలేకపోయాయి.
బాలీవుడ్ లో వసూళ్లని ఎలా కొల్లగొట్టాలో… దక్షిణాదికి అర్థమైపోయింది. రాబోయే పాన్ ఇండియా చిత్రాలకు సలార్ విజయం పెద్ద బూస్టప్. కాకపోతే… దక్షిణాదిన తమ సినిమాల్ని ఎలా అమ్ముకోవాలో మాత్రం బాలీవుడ్ కి అర్థం అవ్వడం లేదు. దర్శకుల్ని తెలుగు, తమిళ భాషల్లోంచి ఎగుమతి చేసుకొంటే తప్ప – దక్షిణాది స్థాయి విజయాల్ని బాలీవుడ్ చూడలేదేమో..?