Salaar movie review
తెలుగు360 రేటింగ్: 3/5
రూ.400 కోట్ల సినిమా వస్తోందంటే ఏ స్థాయిలో ప్రచారం జరగాలి? పాన్ ఇండియా మొత్తం మార్మోగిపోవాలి. కానీ `సలార్` విషయంలో జరిగిన `జీరో` ప్రమోషన్స్ ఆశ్చర్యపరిచాయి. ప్రెస్ మీట్లు లేవు. మీడియా ఇంట్రాక్షన్లు లేవు. కానీ హైప్.. కొంచెం కూడా తగ్గలేదు. సరికదా, రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దానికి కారణం.. ఇది ప్రభాస్ సినిమా. దానికి తోడు ప్రశాంత్ నీల్ సినిమా. హీరోయిజానికీ, ఎలివేషన్లకు కొత్త అర్థం చెప్పిన దర్శకుడు ప్రశాంత్ నీల్. కంటెంట్ ఎలా ఉన్నా, తన కటౌట్ తో లాక్కొచ్చేసే హీరో ప్రభాస్. ఈ ఇద్దరి పేర్లూ పోస్టర్‌పై కనిపిస్తే ఇక చెప్పేదేముంది? అందుకే జీరో ప్రమోషన్లలోనూ సలార్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. మరి ఈ సలార్ ఎలా ఉన్నాడు? అంచనాలకు తగ్గట్టుగా సినిమాని తీశారా, లేదా?
పవర్ ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్ – కేజీఎఫ్ కాన్సెప్ట్ ఇదే.
పవర్ ఫుల్ పీపుల్ మేక్.. పవర్ ఫుల్ ప్లేసెస్ – ఇది కేజీఎఫ్ 2.
సలార్‌లోనూ ఇలాంటి పాయింటే ఉంటుంది. వీరులు యుద్ధాల్లోంచి పుట్టరు. ప్రతీకారం నుంచి ఉద్భవిస్తారు అని! జాగ్రత్తగా గమనిస్తే, సలార్ ఈ పాయింట్ ని ఎడాప్ట్ చేసుకొన్న కథలా అనిపిస్తుంది. ఇది ఇద్దరు స్నేహితుల కథ. దేవా, వరదరాజులు.. వీరిద్దరూ బాల్య స్నేహితులు. వరదరాజుల కోసం దేవా ఏమైనా చేస్తాడు. దేవా కోసం వరద అయితే, తన అధికారాన్నే వదులుకోవడానికి సిద్ధపడతాడు. పెరిగి పెద్దయ్యాక ఒకరిపై మరొకరు యుద్ధానికి దిగాల్సివస్తుంది. అది ఎందుకు? వీరిద్దరి మధ్య ఏమైంది అనేదే సలార్. ఈ కథని.. ట్రైలర్లోనే చెప్పేశాడు దర్శకుడు. మరి సినిమాలో ఇంకేముంది? అనే విషయంలోకి ఇంకాస్త లోతుగా వెళ్తే….
దేవా, వరదల చిన్నప్పటి ఎపిసోడ్ నుంచి కథ మొదలవుతుంది. ఇద్దరి మధ్య బంధాన్ని రెండు మూడు సన్నివేశాల్లోనే చూపించి ఈ కథకు ఆసక్తికరమైన ఆరంభాన్ని అందించాడు ప్రశాంత్ నీల్. ఆ తరవాత కథ.. ఆధ్య (శ్రుతిహాసన్) ఎపిసోడ్ కి షిఫ్ట్ అవుతుంది. ఆధ్యని అంతమొందించడానికి ఓ ముఠా ప్రయత్నించడం, దేవా కాపుకాయడం ఇవన్నీ కథని మరింతగా రక్తి కట్టిస్తాయి. దేవా పాత్రని డిజైన్ చేసిన విధానం కూడా ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. దేవాలోని హీరో ఎప్పుడు బయటకు వస్తాడా? అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. దేవా బద్దలవ్వబోయే ఓ అగ్ని గోళం అనే సంగతి థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకు అర్థమవుతూనే ఉంటుంది. కానీ అదెప్పుడు అనేదే అందరిలోనూ ఉత్కంఠత. సరిగా బాంబు పేలాల్సిన సమయానికే.. పేలుతుంది. ఫ్యాన్స్‌కి ఆ మూమెంట్స్ బాగా నచ్చుతాయి. ప్రభాస్ స్టైలీష్ నడుచుకొంటూ, కళ్లజోడు తగిలించుకొంటూ, సిగరెట్ వెలిగించుకొంటూ ఫైట్ చేస్తుంటే.. విధ్వంసం కూడా అందంగా కనిపిస్తుంది. ఎలివేషన్లకు ప్రశాంత్ నీల్ పెట్టింది పేరు. ఈసారి ప్రభాస్ తోడయ్యాడు. అందుకే ప్రశాంత్ ఆలోచనలు మరింతగా రక్తి కట్టాయి. ఇంట్రవెల్ బ్యాంగ్ అయితే అభిమానులకు పండగే. ఈ ఎపిసోడ్ సుదీర్ఘంగా నడుస్తుంది. అయితే ఎక్కడా బోర్ కొట్టదు. చాలా కాలం తరవాత ప్రభాస్ ని ఎలా చూడాలని అభిమానులు భావించారో అలా చూపించాడు ప్రశాంత్ నీల్.
ప్రశాంత్ స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఒకే షాట్ లో రెండు మూడు ఎడిటింగ్ జంప్‌లు కనిపిస్తుంటాయి. సమాంతరంగా జరుగుతున్న విషయాల్ని కట్, కట్… మంటూ గిర గిర తిప్పుతూ ఒకే మూడ్‌లోకి తీసుకొస్తాడు. ఈ టెక్నిక్ ఈసారీ ప్రభావవంతంగా వాడాడు. దేవా క్యారెక్టర్ కి ఇంట్రవెల్ ముందు ఇచ్చిన ఎలివేషన్లు.. ఫుల్ మీల్స్ లా అనిపిస్తాయి. ఆ ఎపిసోడ్ కే టికెట్ రేటు గిట్టుబాటు అయిపోతుంది. ద్వితీయార్థంలో కాన్సారా ప్రస్థానం మొదలవుతుంది. ఇదో కల్పిత కథ. కేజీఎఫ్‌లా ఓ కల్పిత ప్రపంచం. అయితే అక్కడి మనుషులు, క్యారెక్టర్లు, వాటి మధ్య బంధం, కాన్సారా రూల్స్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. కాన్సారా ప్రపంచంలో దేవా అడుగు పెట్టిన దగ్గర్నుంచి కథ మళ్లీ జోరందుకొంటుంది. కాన్సారాలో కామాంధుడ్ని కాళీ మాతలా అంతమొందించే సీన్.. అక్కడ యాక్షన్‌ని, ఎమోషన్ తో మిక్స్ చేసిన విధానం, ప్రశాంత్ నీల్ టేకింగ్ ఇవన్నీ – గూజ్‌బమ్ ఫీలింగ్ కలిగిస్తాయి. ప్రతీ సన్నివేశాన్నీ సుదీర్ఘంగా చెప్పడం, ప్రతీసారీ కథని వేరే పాత్రలతో నేరేట్ చేసుకొంటూ వెళ్లిపోవడం ఇబ్బంది కలిగించే విషయాలే. దానికి తోడు ఈ సినిమా మొదలైన కాసేపటికే కొన్ని ప్రశ్నలు ఆడియన్ మైండ్ లో నాటుకొంటాయి. వాటికి సమాధానం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. కానీ దర్శకుడు చివరి వరకూ సమాధానాలు చెప్పలేదు. పార్ట్ 2 కోసం సమాధానాలు దాచుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే… ఇలా అన్నీ ప్రశ్నలకే పరిమితం చేసి, సమాధానాలు దాచివేయడం కూడా ప్రేక్షకుల్లో అసంతృప్తిని కలిగించేదే.
కేజీఎఫ్ పోకడలు కొన్ని ఈ సినిమాలోనూ కనిపిస్తాయి. కథని చెప్పే విధానం, ఎడిటింగ్ జంప్‌లు, క్లైమాక్స్‌లో ఓ కొత్త ట్విస్ట్ జోడించి, పార్ట్ 2కి రంగం సిద్ధం చేయడం ఇదంతా కేజీఎఫ్ ప్రభావమే. పాత్రలు ఎక్కువ రాసుకోవడం వల్ల, కాన్సారా ప్రపంచంలోని పరిచయం చేసే సందర్భంలో సరైన క్లారిటీ లేకపోవడం వల్ల కాస్త కన్ఫ్యూజన్ కలుగుతుంది. రక్తపాతం మరీ ఎక్కువ అయిపోయింది. కాకపోతే… అంత విధ్వంసంలోనూ ప్రభాస్ కటౌట్, తన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఫ్యాన్స్‌కు ట్రీట్ లా అనిపిస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే విషయాలు ఈ కథలో కానీ, సన్నివేశాల రూపకల్పనలో కానీ లేవు. కాకపోతే.. ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఈ సినిమా ఏమాత్రం నిరుత్సాహ పరచదు.
ప్రభాస్ కి తగిన కథ, తన పర్సనాలిటీకి తగిన పాత్ర సలార్‌తో దొరికాయి. తొలి సగంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రభాస్ పై మాత్రమే వర్కవుట్ అవుతాయి. ప్రభాస్ తన కటౌట్ తో వాటిని నిలబెట్టాడు. అయితే అన్నీ చిన్న చిన్న డైలాగులే. పట్టుమని నాలుగు లైన్లు కూడా లేవు. యాక్షన్, ఎమోషన్.. ఈ రెండు ఎమోషన్లే ఈ పాత్రలో కనిపిస్తాయి. సలార్ లో ప్రభాస్ ఎంట్రీ చాలా ఆలస్యం అవుతుందని ముందే ఊహాగానాలు వినిపించాయి. అయితే విచిత్రంగా ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీ ఆలస్యమైంది. ఇంట్రవెల్ వరకూ ఆ పాత్రని దాచి పెట్టారు. అయితే ద్వితీయార్థంలో తన పాత్రే కీలకం. శ్రుతి హాసన్‌ని పాటలకు పరిమితమయ్యే పాత్ర కాదు. కథలో కీలకం. బహుశా.. పార్ట్ 2లో ఆ పాత్ర పరిధి మరింత ఎక్కువ ఉంటుందేమో..? బాబీ సింహా కూడా అంతే. జగ్గూభాయ్ గెటప్ బాగుంది. ఈశ్వరీ రావు అక్కడక్కడ కాస్త ఓవర్ ది బోర్డ్ చేసిన ఫీలింగ్ కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే ఆ పాత్ర కూడా పవర్ ఫుల్ గానే ఉంటుంది.
యష్ గురించి తెలుగు ప్రేక్షకులకు సరిగా తెలీదు. అలాంటి యష్నే తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయాలా చూపించాడు ప్రశాంత్ నీల్. అలాంటిది ప్రభాస్ దొరికితే ఆగుతాడా? తన ఎలివేషన్లతో వావ్ అనిపించాడు. కథ విషయంలో కాస్త గందరగోళం ఉంది. పార్ట్ 2 వరకూ దాచాలన్న ఆలోచనతో, చాలా పాత్రల్ని గోప్యంగా ఉంచేశాడు. ప్రశ్నలకు సమాధానాలు దాచేశాడు. ఇదే ఈ సినిమాలో అతి పెద్ద కంప్లైంట్. కాన్సారా ప్రపంచం, అక్కడి పాత్రలు అందరికీ ఎక్కకపోవొచ్చు. రవి బస్రూర్ నేపథ్య సంగీతం అలరిస్తుంది. పాటలకు స్కోప్ లేదు. ఎడిటింగ్ పేట్రన్ కొత్తగా ఉంది. సన్నివేశం రాసుకొనేటప్పుడే దర్శకుడు ఎడిట్ గురించి ఆలోచిస్తే తప్ప ఇలాంటి పేట్రన్ రాదు.
మొత్తంగా చూస్తే.. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ప్రశాంత్ నీల్ తన స్టైల్ లో తీసిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా ఇది. అక్కడక్కడ కొన్ని లోటు పాట్లు ఉండొచ్చు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం పూర్తిగా సంతృప్తి పడిపోతారు. మిగిలినవాళ్లకూ నచ్చితే.. ప్రభాస్ కు మరో బాక్సాఫీసు హిట్ దొరికినట్టే.
తెలుగు360 రేటింగ్: 3/5