బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఐదేళ్ల జైలు శిక్ష. కృష్ణజింకల వేట కేసులో జోథ్ పూర్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు!ఈ వార్త చెప్పగానే.. ఆశ్చర్యపోవడమో, లేదా షాక్ కి గురవడమో లాంటి పరిస్థితి ఇప్పుడు లేదు..! ఎందుకంటే, సల్మాన్ పై గతంలో ఉన్న కేసులు, వాటిపై వచ్చిన తీర్పులు, వాటి నుంచి సల్మాన్ తప్పించుకున్న తీరు చూసేశాం! కాబట్టి, ఇలాంటి నిస్పృహే కలుగుతుంది. దాదాపు ఇరవయ్యేళ్ల కిందట హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ సమయంలో.. రెండు కృష్ణజింకల్ని వేటాడి చంపినట్టు కోర్టు తాజాగా తీర్పు నిచ్చింది. సల్మాన్ నేరాలకు అలవాటుపడ్డారనీ, ఆయనేం చేసినా ప్రజలు గమనిస్తారనీ, అమాయక జీవుల్ని వేటాడి చంపిన విధానం శిక్షార్హమని న్యాయమూర్తి తీర్పు నివ్వగానే.. సల్మాన్ కోర్టులో బోరున ఏడ్చేశాడు. ఈ కేసులో మూడేళ్లకుపైబడి శిక్ష పడింది కాబట్టి… బెయిల్ కోసం రాజస్థాన్ హైకోర్టులో ఇవాళ (శుక్రవారం) అప్పీలు చేస్తున్నారు.
సల్మాన్ కు శిక్ష ఖరారైన తరువాత.. ఆయన చెల్లెళ్లు ఏడేస్తూ బాలీవుడ్ కి వందల కోట్ల నష్టం వస్తుందనీ, అన్నయ్య అమాయకుడనీ వాపోయారు! పాపం, ఈ సీన్ చూస్తుంటే సల్మాన్ కు శిక్ష అనూహ్యంగా పడిందనో, ఎవ్వరూ ఊహించని దారుణం జరిగిపోయిందేమో అనిపిస్తుంది. వాస్తవం ఏంటంటే, ఇది 1998 నాటి కేసు. ఇన్నాళ్లకు నత్త నడకన పాకుతూ పాకుతూ విచారణ సాగీ సాగీ తీర్పు వరకూ వచ్చింది. అయినా, సల్మాన్ ఐదేళ్లు జైల్లో ఉంటాడని ఎవరైనా నమ్ముతారా..? ఆయన చెల్లెళ్లు అనవసరంగా ఎమోషనల్ అయిపోతున్నారు. వెంటనే బెయిల్ కి అప్లై చేశారు కదా. అన్నయ్య పనితీరుపై నమ్మకం ఉండాలి కదా. బెయిల్, ఆ తరువాత అప్పీళ్లు.. కోర్టు.. వాదనలు. వాయిదాలు.. చాలా దశలున్నాయి. కాబట్టి, ఐదేళ్లపాటు సల్లూ భాయ్ ఊచలెక్కట్టేస్తారని భయపడాల్సిన పనిలేదు..!
2002లో, తప్పతాగి ఫుట్ పాత్ మీద నుంచి కారు పోనిచ్చి, అమాయకుల ప్రాణాలను బలిగొన్న కేసు ఏమైంది..? ఒకరి మరణం, నలుగురి గాయమైన ఆ కేసులో కూడా సల్మాన్ కు జైలు శిక్ష పడింది. కానీ, తరువాతేమైందీ.. బెయిల్ వచ్చింది. దాదాపు 13 ఏళ్లపాటు విచారణ సాగి సాగీ చివరికి తుస్సుమంది. నిర్దోషిగా బయటకి రాలే..! హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ని దోషిగా తేలుస్తూ, ఐదేళ్ల శిక్ష విధిస్తూ ముంబై సెషన్స్ కోర్టు 2015, మేలో తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ముంబై హైకోర్టును ఆశ్రయించాడు సల్మాన్. అక్కడేమైందీ… సల్మానుడు మద్యము సేవించి, వాహనమును నడిపిన ఆధారములు స్పష్టముగా లేనందున, ఊహాగానములతో సల్మానుని దోషిగా తేల్చలేమని 2015 డిసెంబర్ లో ముంబై హైకోర్టు సల్మాన్ ని నిర్దోషి అని చెబుతూ తీర్పునిచ్చింది. ఇప్పుడు కూడా మహా అయితే మరో వారం, పదిరోజుల్లో గతంలో మాదిరిగానే సల్మాన్ బయటకి వచ్చేస్తాడనేది చాలామంది అభిప్రాయం. ఈ క్రమంలో కోర్టుల పనితీరును తప్పుపట్టాలన్నది ఉద్దేశం కాదు. తనకు అనుకూలంగా వాదనలు వినిపించుకోవడం, న్యాయస్థానం ముందు ఎలాంటి ఆధారాలు చూపితే నిర్దోషిగా బయటపడగలననే అనుభవం సల్మాన్ కి ఉందని గుర్తు చేసుకోవడమే మాత్రమే..!