ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ప్రజల్ని ఓ మాదిరిగా కూడా చూడటం లేదు. పరిపాలన చేయమని అధికారం ఇస్తే అది మాత్రం చేయకుడా ఇష్టారీతిన రాజకీయం చేస్తూ ప్రజల జీవితాలతో మాత్రం ఆడుకుంటున్నారు. తాజాగా రెండు రాష్ట్రాలను కలుపుతామంటూ కొత్త వాదన తీసుకు వచ్చారు. సజ్జల వ్యాఖ్యలు.. వైసీపీ రాజకీయంపై రాను రాను ప్రజల్లో విరక్తి పుట్టే పరిస్థితి వచ్చింది.
రూ. లక్ష కోట్ల ఏపీ ఆస్తులు తెలంగాణకు వదిలేస్తున్న వైనం బయటపడేసరికి కొత్త రాగం !
విభజన సంగతి వదిలేయండి అని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. ఈ విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టంగా చెప్పారు. .. రాష్ట్రాన్ని కలపడం సాధ్యం కాదు కానీ..ఏపీ ప్రయోజనాల కోస అయినా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి సజ్జల వద్ద సమాధానం లేదు. విభజన కారణంగా తెలంగాణ నుంచి ఏపీకి లక్ష కోట్ల సంపద వాటా కింద రావాల్సి ఉంది. కానీ తెలంగాణ ఇవ్వడం లేదు. కేంద్రాన్ని అడగడం లేదు. చివరికి.. అసలు వదిలేయండి అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి రాష్ట్ర ద్రోహనికి పాల్పడ్డారు. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకునేందుకు సమైక్య రాష్ట్రం అనే వాదన ప్రారంభిస్తున్నారు.
సచివాలయ భవనాలుతో సహా సర్వం తెలంగాణకు సమర్పయామి !
జగన్ గెలిచిన వెంటనే రాజ్ భవన్ లో ఇఫ్తార్ విందుకు వెళ్లారు. కనీసం ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. కానీ హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాలు తెలంగాణకు ఇచ్చేశారు. అక్కడ్నుంచి ప్రారంభమైన అప్పగింతలు.. ఇప్పుడు లక్ష కోట్ల ఆస్తులు ఇచ్చే వరకూ చేరాయి. తెలంగాణ నుంచి రావాల్సిన ఒక్క దాన్నీ తెచ్చుకోలేకపోయారు. చివరికి కరెంట్ బకాయిలు కూడా. ఇంత చేతకాని పాలన చేస్తూ..ఇప్పుడు సమైక్య రాష్ట్రమనే వాదనతో ప్రజల్ని బకరాలను చేయడానికి తాము సిద్ధమని తెర ముందుకు వస్తున్నారు.
ప్రజల మధ్య చిచ్చు పెట్టి బతకడమూ ఓ రాజకీయమేనా?
ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలు విడిపోయింది. ఎనిమిదేళ్లు దాటిపోయింది. ఒకప్పుడు కలిసి ఉండేవని మర్చిపోయేంతగా రెండు రాష్ట్రాల మధ్య మార్పులు వస్తున్నాయి. కానీ ప్రజల జీవనంలో మార్పుల్లేవు. హైదరాబాద్ ఆధారపడిన ఆంధ్రులకు ఎలాంటి సమస్య తలెత్తలేదు. ఉపాధి కోసం ఎప్పట్లాగే పెద్ద ఎత్తున హైదరాబాద్కు వస్తున్నారు. వారికెవరూ ఆటంకాలు పెట్టడం లేదు. ఎవరి రాష్ట్రంలో వారు పాలన చేసుకుంటున్నారు. మరి ఇప్పుడెందుకు రాజకీయాలు ?
ఆస్తులే కాదు.. టీఆర్ఎస్ రాజకీయానికీ సహకరిస్తారా ?
టీడీపీ లేదా బీజేపీ గెలిస్తే తెలంగాణ, ఏపీని మళ్లీ కలిపేస్తారంటూ టీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేస్తూ ఉంటారు. విభజనపై మోదీ చేసిన వ్యాఖ్యలను పలుమార్లు ప్రస్తావిస్తూ ఉంటారు. బీజేపీ గెలిస్తే మళ్లీ సమైక్య రాష్ట్రం వస్తుందని చాలా సార్లు హెచ్చరించారు. ఏపీ వైపు నుంచి ఎప్పుడూ మళ్లీ రెండు రాష్ట్రాలను కలపాలనే వాదన తీసుకు రాలేదు. ఇప్పుడు అధికార పార్టీకి చెందిన కీలక నేతనే సమైక్య రాష్ట్రం గురించి మాట్లాడారు. దీంతో బీఆర్ఎస్కు మరోసారి సెంటిమెంట్ రాజకీయాలు చేసుకునే అవకాశం .. ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ కల్పించిందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో కలుగుతోంది.
ఇప్పటికే ఏపీలో మూడు రాజధానుల నినాదంతో మూడు రాష్ట్రాలు కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇలా చిచ్చులు పెట్టి … అధికారం ఇచ్చిన ప్రజలకు మనశ్మాంతి లేకుండా చేయడం వైసీపీ స్టైల్అనుకోవాలేమో ?