”కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ.” భగవద్గీతలో సుప్రసిద్ధమైన శ్లోకమిది. “నీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది. దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు. అలాగే పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి” అనేది ఈ శ్లోకం అర్ధం.
హీరోయిన్ సమంత ఇప్పుడు ఇదే శ్లోకాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. సమంతకు సడన్ గా ఈ శ్లోకం గుర్తుకు రావడానికి కారణం.. ”శాకుంతలం’ సినిమా అనే చెప్పాలి. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు చాలా నిరాశజనకమైన స్పందన వచ్చింది. కథ కథనంలో సృజనాత్మకత లేకపోవడం, పేలవమైన గ్రాఫిక్స్ తో నిరాశపరిచింది.
ఈ సినిమా కోసం చాలా కష్టపడింది సమంత. అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రమోషన్స్ చేసింది. అయితే ఆ కష్టానికి తగ్గ ఫలితం రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమైయ్యాయి. ఈ నేపధ్యంలో సమంత భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని పోస్ట్ చేసి.. పనిపైనే తన దృష్టి వుంది కానీ ఫలితంపై కాదని తన మానసిక స్థితిని వెల్లడించింది.